BJP: కాంగ్రెస్ నేతల అవినీతిని కచ్చితంగా బయటపెడతా... సూట్‌కేసులు, కారు గిఫ్టులు ఆ పార్టీలో సహజమే: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

BJP leader NVSS prabhakar allegations on Congress leaders
  • తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదన్న ప్రభాకర్ 
  • నోటీసులు వస్తే న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
  • బీజేపీ పరువును కించపరిచేలా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం
  • కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను ఎందుకు మార్చిందో చెప్పాలని డిమాండ్
కాంగ్రెస్ నేతల అవినీతిని తాము కచ్చితంగా బయటపెడతామని, ఆ పార్టీలో సూట్‌కేసులు, కారు గిఫ్టులు సహజమేనని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మంగళవారం ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ నుంచి తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదన్నారు. నోటీసులు వస్తే న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లీగల్ సెల్ నిర్ణయం మేరకు ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్ నేతల నుంచి దీపాదాస్ మున్షీకి బెంజ్ కారు బహుమతిగా వెళ్లినట్లు ఆయన ఇటీవల ఆరోపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ దీపాదాస్ లీగల్ నోటీసులు పంపించారు. అయితే ఈ నోటీసులు తనకు అందలేదని బీజేపీ నేత చెప్పారు.

ఢిల్లీలో ప్రభాకర్ నేడు మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని.... వీటిపై కూడా వారు ఆధారాలు చూపాలని నిలదీశారు. బీజేపీ పరువును కించపరిచేలా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ లీగల్ సెల్ రంగంలోకి దిగబోతుందన్నారు. అసలు కాంగ్రెస్ ఇంఛార్జులను ఎందుకు తొలగించిందో చెప్పాలన్నారు. గతంలో మాణిక్ రావు ఠాక్రే, మాణిక్కం ఠాగూర్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. వారిపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 

తెలంగాణలో రెవెన్యూ, ఇరిగేషన్, ఐటి పరిశ్రమ శాఖలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపించిందన్నారు. ఇరిగేషన్ శాఖ, పురపాలక శాఖలో అక్రమాలు బయటకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు చేపట్టడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణలో అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు.
BJP
Congress
nvss prabhakar
Telangana

More Telugu News