Team India: నాలుగో టెస్టులో టీమిండియా విక్టరీ... 3-1తో సిరీస్ కైవసం

Team India beat England in Ranchi and claimed series
  • మూడున్నర రోజుల్లోనే ముగిసిన రాంచీ టెస్టు
  • 5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం
  • 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లకు ఛేదించిన రోహిత్ సేన
  • ఓ దశలో 120 పరుగులకే 5 వికెట్లు డౌన్
  • ఆరో వికెట్ కు అజేయంగా 72 పరుగులు జోడించిన గిల్, జురెల్
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా మరోసారి సొంతగడ్డపై అదరగొట్టింది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన 5 వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఓ దశలో టీమిండియా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినా... శుభ్ మాన్ గిల్, ధ్రువ్ జురెల్ జోడీ ఆరో వికెట్ కు అజేయంగా 72 పరుగులు జోడించి టీమిండియా విజయాన్ని ఖాయం చేసింది. గిల్ 52, జురెల్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు, రూట్ 1, టామ్ హార్ట్ లే 1 వికెట్ తీశారు. 

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 55, యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేశారు. రజత్ పాటిదార్ (0), రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా, టీమిండియా 307 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ను రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు 145 పరుగులకు కుప్పకూల్చారు. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ మూడున్నరోజుల్లోనే ముగిసింది. 

రాంచీ టెస్టులో విజయంతో టీమిండియా ఈ ఐదు టెస్టుల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. సిరీస్ లో తొలి టెస్టు హైదరాబాద్ లో జరగ్గా... టీమిండియా అనూహ్యరీతిలో పరాజయం పాలైంది. అయితే, ఆ తర్వాత విశాఖ, రాజ్ కోట్, రాంచీల్లో జరిగిన మూడు టెస్టుల్లో వరుసగా నెగ్గి సిరీస్ విజేతగా నిలిచింది. 

ఇక, ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
Team India
England
Ranchi Test
Series

More Telugu News