Team India: రాంచీ టెస్టులో జో రూట్ సెంచరీ... సిరాజ్ కు రెండు వికెట్లు

Joe Root completes ton in Ranchi test
షార్ట్స్‌లో చూడండి
రాంచీలో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట చివరికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ సెంచరీ సాధించి అజేయంగా నిలవడం విశేషం. రూట్ కు ఇది కెరీర్ లో 31వ టెస్టు సెంచరీ. 

టీమిండియా కొత్త పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును జో రూట్ ఆదుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ బెన్ ఫోక్స్ తో కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. బెన్ ఫోక్స్ 126 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. బెన్ ఫోక్స్ ను అవుట్ చేసిన సిరాజ్... ఆ తర్వాత టామ్ హార్ట్ లేను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 

ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న రూట్... ఓల్లీ రాబిన్సన్ తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రూట్ 106 పరుగులతోనూ, రాబిన్సన్ 31 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. రూట్ మొత్తం 223 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు కొట్టాడు. టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, జడేజా 1, అశ్విన్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్ ను దెబ్బతీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 11 పరుగులు చేశారు. ఓల్లీ పోప్ (0) డకౌట్ కాగా, జానీ బెయిర్ స్టో 38 పరుగులతో ఓ మోస్తరుగా రాణించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (3) నిరాశపరిచాడు.
Go Back to Shorts
Team India
England
Joe Root
4th Test
Ranchi

More Telugu News