Lasya Nandita: యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు, లోకేశ్ ఆవేదన

Revanth Reddy Chandrababu Nara Lokesh on MLA Lasya Nandita sudden demise
  • రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే నందిత
  • అత్యంత విషాదకరమన్న రేవంత్ రెడ్డి
  • మరణ వార్త విని షాక్ కు గురయ్యానన్న చంద్రబాబు
బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని చెప్పారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం... ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... రోడ్డు ప్రమాదం కారణంగా లాస్య నందిత చనిపోయారనే వార్తను తెలుసుకుని షాక్ కు గురయ్యానని తెలిపారు. ఆమె తండ్రి సాయన్న మరణించిన ఏడాదిలోపే నందిత కూడా మృతి చెందడం దురదృష్టకరమని చెప్పారు. ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని... కానీ, విధిరాత మరోలా ఉందని అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

నారా లోకేశ్ స్పందిస్తూ... నందిత మృతి వార్త బాధను కలిగించిందని చెప్పారు. ఏడాది కాలంలో వారి కుటుంబం ఇద్దరు వ్యక్తులను కోల్పోవడం విషాదకరమని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
Lasya Nandita
Revanth Reddy
Congress
chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News