Indore Court: నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు కీలక తీర్పు

Indore court orders woman to pay Rs 5000 per month to estranged husband
  • ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశం
  • భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణ
  • ఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్త
  • ఆమె కోసం తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదన
  • ఇరు పక్షాల వాదనల అనంతరం భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పు
తన నుంచి విడిపోయిన నిరుద్యోగి అయిన భర్తకు ప్రతినెల రూ. 5 వేల చొప్పున భరణం చెల్లించాలంటూ ఇండోర్‌లోని కుటుంబ న్యాయస్థానం ఓ మహిళను ఆదేశించింది. కట్నం కోసం  భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రతిగా, ఆమె భర్త కోర్టుకు ఫిర్యాదు చేస్తూ.. పెళ్లి తర్వాత ఆమె తనను వేధించిందని, భరణం డిమాండ్ చేసిందని పేర్కొన్నాడు. భార్య కోసం చదువును మధ్యలోనే ఆపేయాల్సి రావడంతో నిరుద్యోగిగా మిగిలిపోయానని తెలిపాడు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిరుద్యోగి అయిన భర్తకు ప్రతినెల రూ. 5000 భరణం చెల్లించాలని ఆదేశించింది. 

ఆమె వాంగ్మూలం పరస్పర విరుద్ధంగా ఉండడాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తానో బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్టు తొలుత పేర్కొంది. అయితే, ఆ తర్వాత కోర్టులో మాత్రం తానో నిరుద్యోగినని తెలిపింది. ఈ నేపథ్యంలో బలమైన సాక్ష్యం లేకపోవడంతో విడిపోయిన భర్తకు ప్రతినెల రూ. 5 వేల చొప్పున చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. భర్తకు భరణం చెల్లించాలని భార్యను కోర్టు ఆదేశించడం మధ్యప్రదేశ్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి కేసుల్లో భర్తలే భరణం చెల్లించాల్సి వస్తుందని న్యాయవాది తెలిపారు.
Indore Court
Estranged Husband
Dowry
Maintenance
Madhya Pradesh

More Telugu News