YSRCP: వైసీపీకి ఇప్పటి వరకు ఎంతమంది సిట్టింగ్ ఎంపీలు దూరమయ్యారంటే..!

  • నిన్న వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • ఇప్పటికే రాజీనామా చేసిన బాలశౌరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు
  • చాలా కాలం నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న రఘురామకృష్ణరాజు
So far 4 MPs moved away from YSRCP

ఏపీలో అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీకి వరుసగా దూరమవుతున్నారు. వివిధ కారణాలతో వారు వైసీపీని వీడుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్న పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీకి తాను చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరుతూ ఆయన జగన్ కు లేఖ రాశారు. 

వేమిరెడ్డి రాజీనామాతో... ఇప్పటి వరకు వైసీపీకి దూరమైన ఎంపీల సంఖ్య నాలుగుకి చేరింది. ఇటీవలే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరారు. నరసరావుపైట లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ - జనసేన కూటమి తరపున అవకాశం వస్తే పోటీ చేయాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఇక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీకి రాజీనామా చేయకపోయినా... చాలా కాలం నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై ఆయన ప్రతి రోజు విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. 

నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారయింది. నరసాపురం లోక్ సభ స్థానం టీడీపీ - జనసేన కూటమిలో భాగంగా ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ తరపున పోటీ చేయాలని రఘురాజు భావిస్తున్నారు. మరోవైపు, మరో ఇద్దరు ఎంపీలు కూడా వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News