Jaga Jyothi: జగజ్యోతి ఇంటి నుంచి రూ. 65 లక్షలకుపైగా నగదు, కోటిన్నర విలువైన బంగారు నగల స్వాధీనం

ACB Seize over 3 kg gold and over Rs 65 lakh cash from Jaga Jyothi house
  • లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివజ్యోతి
  • సోమవారం నుంచి నిన్న ఉదయం వరకు ఇంట్లో సోదాలు
  • అస్వస్థతగా ఉందంటే ఉస్మానియాకు తరలింపు
  • పరీక్షల అనంతరం ఆరోగ్యంగా ఉన్నట్టు నివేదిక
  • నేడు రిమాండ్‌కు తరలింపు

తెలంగాణలో అవినీతి నిరోధకశాఖ లంచగొండి అధికారుల భరతం పడుతోంది. ఇటీవల హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ లెక్కలు సరిచేసిన ఏసీబీ రెండు రోజుల క్రితం గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని వలవేసి పట్టుకున్నారు. నిజామాబాద్‌లో పూర్తయిన పనికి బిల్లులు చెల్లించడంతోపాటు గాజులరామారంలో జువైనల్ బాలుర వసతిగృహం నిర్మాణానికి సవరించిన అంచనాలు రూపొందించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆమెను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

లంచంగా తీసుకుంటున్న రూ. 84 వేలను ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం నుంచి నిన్న ఉదయం వరకు సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా రూ. 65,50,000 నగదు, రూ. 1,51,08,175 విలువైన 3.639 కిలోల బంగారు నగలతోపాటు ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భూముల విలువను అంచనా వేస్తున్నారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.

సోమవారం రాత్రి ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో తనకు అస్వస్థతగా ఉందని అధికారులకు చెప్పడంతో జగజ్యోతిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. నేడు ఆమెను డిశ్చార్జ్ చేసిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News