Dwarampudi Chandrasekhar Reddy: వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న ఎమ్మెల్యే ద్వారంపూడి

MLA dwarampudi responds to controversy over his comments on former mla kondababu
  • మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఉద్దేశిస్తూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
  • మత్స్యకార జాతిని కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు
  • తాను మత్స్యకార జాతిని అవమానించలేదని ఎమ్మెల్యే స్పష్టీకరణ
  • టంగ్ స్లిప్ అయిందని వివరణ
తన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఉద్దేశించినవే తప్ప మత్స్యకార జాతిని కాదని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను టంగ్ స్లిప్ అయ్యానని, ఈ అంశాన్ని రాద్ధాంతం చేయొద్దన్నారు. సోమవారం కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మత్స్యకార నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యాలను వక్రీకరిస్తున్నారనీ, రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

‘‘రూ. కోటితో గుడి కడితే రూ. 10 కోట్లు వసూలు చేసే జాతి, కుటుంబం నీది.. నీలా ప్రజల దగ్గర విరాళాలు తీసుకుని నేను టీటీడీ ఆలయం కట్టలేదు’ అని రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే వనమాడిని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో, తమను అవమానించారంటూ ఆ సామాజికవర్గం భగ్గుమనడంతో సోమవారం ద్వారంపూడి వివరణ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే, మత్స్యకార జాతిని కించపర్చేలా మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జనసేన మత్స్యకార వికాస విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది మత్స్యకారుల మనోభావాలను ఎమ్మెల్యే వ్యాఖ్యలు దెబ్బతీశాయని కాకినాడ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మత్స్యకార సంఘ నాయకుడు తుమ్మల రమేశ్ అన్నారు.
Dwarampudi Chandrasekhar Reddy
Kondababu
Kakinada
Andhra Pradesh
YSRCP

More Telugu News