Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక

Congress leader Priyanka Gandhi admitted to hospital due to ill health
  • భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని వెల్లడి
  • ఆరోగ్యం మెరుగైన వెంటనే యాత్రలో పాల్గొంటానని ప్రకటన
  • అనారోగ్యంపై ఎక్స్‌ వేదికగా స్వయంగా ప్రకటించిన ప్రియాంక
  • నేడు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ యాత్ర
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో శుక్రవారం ఆమె ఓ హాస్పిటల్‌లో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక గాంధీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దీంతో రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ నేడు (శుక్రవారం) ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే సందర్భంగా యాత్రలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ సాధ్యపడడం లేదని ఆమె తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే యాత్రలో పాల్గొంటానని ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే సందర్భం కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కానీ అనారోగ్యం కారణంగా ఈరోజే హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. యాత్ర కోసం చందౌలీ-బనారస్‌కు చేరుకున్న యాత్రికులు, యూపీ కాంగ్రెస్‌కు చెందిన నా సహచరులు, యాత్ర కోసం సన్నద్ధమవుతున్న సోదరులు అందరికీ శుభాకాంక్షలు’’ అని ప్రియాంక పోస్టులో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత జోడో న్యాయ్ యాత్ర’ శుక్రవారం (ఫిబ్రవరి 16) వారణాసి మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. భాదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా ఫిబ్రవరి 19న అమేథి లోక్‌సభ నియోజకవర్గానికి చేరుకుంటుంది. నియోజకవర్గంలోని గౌరీగంజ్‌లో బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. కాగా మరుసటి రోజు యాత్ర ప్రస్తుతం సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత రాజస్థాన్‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది.
Priyanka Gandhi
Congress
Rahul Gandhi
Bharath Jodo Nyay Yatra

More Telugu News