Pawan Kalyan: పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా

Pawan Kalyan Bhimavaram tour postponed
  • ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన
  • రేపు భీమవరం నుంచి పర్యటన ప్రారంభం
  • హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుతించని అధికారులు
  • త్వరలోనే భీమవరం పర్యటన తదుపరి తేదీ ప్రకటిస్తామన్న మహేందర్ రెడ్డి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రేపు (ఫిబ్రవరి 14) భీమవరం నుంచి తన పర్యటన ప్రారంభించాలని పవన్ భావించారు. అయితే, ఆయన పర్యటన అనూహ్య రీతిలో వాయిదా పడింది. 

వాస్తవానికి పవన్ కల్యాణ్ హెలికాప్టర్ లో భీమవరం వెళ్లాలనుకున్నారు. భీమవరంలో జనసేన నేతలు హెలిప్యాడ్ కూడా సిద్ధంచేశారు. అయితే, అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో, పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 

పవన్ భీమవరం పర్యటనకు రోడ్లు భవనాల శాఖ మోకాలడ్డిందని విమర్శించారు. అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లే కారణమని ఆరోపించారు. భీమవరంలో పవన్ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే తెలియజేస్తామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 

"భీమవరం విష్ణు కాలేజి ప్రాంగణంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలీప్యాడ్ లో పవన్ కల్యాణ్ ప్రయాణించే హెలీప్యాడ్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపుతూ అభ్యంతర పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్టు అర్థమవుతోంది. 

విష్ణు కాలేజిలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉంది. 

ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బి అధికారులతో అనుమతుల విషయంలో మెలికలు పెట్టిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నాం" అని మహేందర్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News