స్పైస్‌జెట్‌లో కొలువుల కోత.. 1400 మందిని ఇంటికి పంపుతున్న ఎయిర్‌లైన్ సంస్థ
- ఏడాదికి రూ. 100 కోట్లు ఆదా చేయడమే లక్ష్యం
- జనవరి నెల వేతనాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు
- ఇప్పటికే తొలగింపు నోటీసుల జారీ
- పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్న ఇన్వెస్టర్లు
స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం 9 వేల మంది ఉద్యోగులున్నారు. 30 విమానాలు నిర్వహిస్తోంది. వేతనాల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తుండగా దానిని తగ్గించుకునే వ్యూహంలో స్పైస్‌జెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీచేసినట్టు సమాచారం.
స్పైస్‌జెట్ గత కొన్ని నెలలుగా వేతనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. జనవరి నెల జీతాల కోసం ఇప్పటికీ కొందరు ఎదురుచూస్తున్నారు. రూ.2 వేల కోట్ల నిధుల కోసం సంస్థ ప్రయత్నాల్లో ఉంది. అయితే, పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు వెనకాడుతున్నారు.
2019లో స్పైస్‌జెట్ 118 విమానాలు, 16 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. దాని సమీప ప్రత్యర్థి ఆకాశ ఎయిర్ 3,500 మంది ఉద్యోగులతో 23 విమానాలు నిర్వహిస్తోంది. దేశీయ విమాన మార్కెట్‌లో దాదాపు 4 శాతం వాటాను కలిగి ఉంది.