Life Term: యావజ్జీవ కారాగార శిక్ష అంటే?.. స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో సీరియల్ కిల్లర్ పిటిషన్

SC to hear plea by convict seeking to determine if a life sentence is for life
  • మూడు హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న చంద్రకాంత్ ఝా
  • ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన ఢిల్లీ కోర్టు
  • యావజ్జీవం అంటే దోషి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్న పిటిషనర్
  • స్పందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

కోర్టులు విధించే యావజ్జీవ శిక్ష అంటే ఏమిటి? యావజ్జీవం అంటే జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందేనా? అసలేంటీ యావజ్జీవం? అంటూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ చంద్రకాంత్ ఝా అనే దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2006, 2007లో జరిగిన మూడు హత్య కేసులలో ఝా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టులో యావజ్జీవం అంటే ఏమిటో నిర్వచనం చెప్పాలని పిటిషన్ వేశాడు. ఆ శిక్ష పడితే జీవితాంతం జైలులో ఉండాల్సిందేనా? లేదంటే సీఆర్‌పీసీ సెక్షన్ 432 కింద దానిని రద్దు చేయడం కానీ, శిక్షను తగ్గించడం కానీ చేయవచ్చా? అని స్పష్టత కోరాడు. ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను ఢిల్లీ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని పేర్కొన్నాడు. యావజ్జీవ శిక్షను జీవితాంతం అని పరిగణిస్తే కనుక అది దోషిగా తన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందని పిటిషన్‌లో ఝా పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా కోరుతూ జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News