ఎంపీ రామ్మోహన్ నాయుడు సహా 8 మంది ఎంపీలకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రధాని మోదీ
- పార్లమెంట్ క్యాంటీన్‌లో తనతో కలిసి భోజనం చేసే అవకాశమిచ్చిన ప్రధాని
- ప్రధాని మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని ఎంపీలకు సందేశం
- ‘పదండి మీకు పనిష్మెంట్ ఉంది’ అంటూ క్యాంటీన్‌కు తీసుకెళ్లిన మోదీ
‘‘ప్రధాని మోదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు’’ అంటూ ఎంపీలకు సందేశం అందింది. దీంతో ఎంపీలంతా మోదీ రూమ్‌కు వెళ్లారు. ఎంపీలను చూసిన మోదీ.. ‘‘పదండి. మీ అందరికీ శిక్ష విధించాలి’’ అంటూ క్యాంటీన్‌కు తీసుకెళ్లారు. తీరికలేని షెడ్యూల్స్, విదేశీ పర్యటనలు, గుజరాత్ రాష్ట్రంతో పాటు పలు అంశాలపై ప్రధాని మాట్లాడారని ఎంపీలు వివరించారు. 2015లో ప్రత్యేక రక్షణ బృందం (ఎస్‌పీజీ) అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లినట్లు ప్రధాని గుర్తుచేసుకున్నారని ఓ ఎంపీ వెల్లడించారు. ప్రధానమంత్రితో భోజనం చేయడం గొప్ప అనుభవమని ఎంపీలు పేర్కొన్నారు. కాగా ఈ సర్‌ప్రైజ్ భోజనానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, పార్టీలకు చెందిన సహచర ఎంపీలతో సంతృప్తికరంగా మధ్యాహ్న భోజనం చేశానని పేర్కొన్నారు.