payal shankar: ఆరు గ్యారెంటీలు తప్ప తాము ఏమీ పట్టించుకోమనేలా గవర్నర్ ప్రసంగం ఉంది: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

  • తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వారి పేర్లలో చిన్నమ్మ సుష్మాస్వరాజ్ పేరు లేదని ఆవేదన
  • తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిన పెడాతారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదన్న బీజేపీ ఎమ్మెల్యే
  • వెనుకబడిన జిల్లాలకూ పెట్టుబడులు రావాలన్న పాయల్ శంకర్
  • కామారెడ్డిలో ఆ రెండు పార్టీలనూ ఓడించామన్న బీజేపీ ఎమ్మెల్యే
BJP MLA Payal Shankar fires at Congress government

ఆరు గ్యారంటీలు తప్ప తాము ఏమీ పట్టించుకోమనేలా గవర్నర్ ప్రసంగం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలా చురుగ్గా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వారిని గుర్తు చేసుకోవాల్సిందేనని, కానీ ఆ జాబితాలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌ను మరిచిపోవడం ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమన్నారు.

గవర్నర్ ప్రసంగంలో పలు అంశాలపై ఈ ప్రభుత్వం స్పష్టతనివ్వలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు మూసివేయిస్తామని కాంగ్రెస్ చెప్పిందని... కానీ ఎప్పటి నుంచి వీటిని మూసివేస్తారో గవర్నర్ ప్రసంగంలో స్పష్టతనివ్వలేదన్నారు. గాడితప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిన పెడాతారో చెప్పలేదన్నారు. తెలంగాణకు ఉన్న అప్పుల విషయంలోను గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదన్నారు. రైతులకు రైతు బీమాతో పాటు పంట బీమా ఉండాలన్నారు.

వెనుకబడిన జిల్లాలకూ పెట్టుబడులు రావాలి

తెలంగాణకు కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.40వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిందని... ఇందుకు సంతోషమేనని కానీ వెనుకబడిన జిల్లాలలోనూ ఉపాధి అవకాశాల కోసం ఆయా ప్రాంతాలకు పెట్టుబడులు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. జిల్లాలకు కూడా పెట్టుబడులు రావాలన్నారు. ఉమ్మడి జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలలో గందరగోళ పరిస్థితి ఏర్పడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. కాబట్టి వెనుకబడిన జిల్లాలలోనూ పెట్టుబడులు తీసుకు రావడానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన హామీలలో రైతు రుణమాఫీ ఒకటని అన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని... ఎన్నికల సమయంలో తమతో కొంతమంది చెబితే... ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసే హామీలు లేదా అమలు సాధ్యం కానీ హామీలు ఇవ్వలేమని తాము ఆ రోజే చెప్పామన్నారు. కానీ రుణమాఫీ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎప్పుడు దీనిని అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం లేదన్నారు.

ఆ రెండు పార్టీలనూ కామారెడ్డిలో ఓడించాం

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ అంటే... బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తాయని... కానీ వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ ఆ రెండు పార్టీల ముఖ్య నేతలను తాము కామారెడ్డిలో ఓడించామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వారిని ఓడించే అవకాశం ప్రజలు బీజేపీకి ఇచ్చారన్నారు. కానీ తమపై ఆ రెండు పార్టీలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని పాయల్ శంకర్ మండిపడ్డారు.

More Telugu News