Pakistan Poll Results: పాక్‌లో నాటకీయ పరిణామాలు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదలలో జాప్యం

  • శుక్రవారం తెల్లవారుజామున వెలువడ్డ తొలి ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ మద్దతున్న అభ్యర్థుల గెలుపు
  • ఆ వెంటనే ఫలితాల విడుదల నిలిపివేత
  • తమ గెలుపును అడ్డుకుంటున్నారన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ
  • గెలుపు తమదేనంటూ ఘనంగా ప్రకటన, పీటీఐ ఆరోపణలను ఖండించిన ఈసీ
  • ఓట్ల కౌంటింగ్‌లో జాప్యం వల్లనే ఫలితాల విడుదల ఆగినట్టు వివరణ
Pak poll results declaration halted midway

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం ఎన్నికలు జరిగిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా శుక్రవారం తెల్లవారుజామున ఫలితాల వెల్లడిని అకస్మాత్తుగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో గెలుపు తమదేనంటూ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని పీటీఐ ప్రకటించుకుంది. దీంతో, తదుపరి ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

పాక్ ఎన్నికల కమిషన్ శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు తొలి ఫలితాన్ని విడుదల చేసింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతిస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినట్టు వెల్లడించింది. ఖైబర్ పాంఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని పీకే-76, పీకే-6 తోపాటు స్వాట్‌లోని పీకే-4 స్థానంలో పీటీఐ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినట్టు పేర్కొంది. ఆ తరువాత ఫలితాల విడుదల నిలిచిపోవడంతో తమ గెలుపును అడ్డుకుంటున్నారని పీటీఐ ఆరోపించింది. 

కాగా, పీటీఐ ఆరోపణలను పాక్ ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ ఖండించారు. ఓట్ల లెక్కింపులో ఆలస్యం వల్లే ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోందన్నారు. మీడియాలోని ఈసీ వ్యతిరేక కథనాలను తోసిపుచ్చారు. శుక్రవారం ఉదయానికి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాము 150 స్థానాల్లో గెలిచినట్టు పీటీఐ చైర్మన్ గోహార్ ఖాన్ ప్రకటించుకున్నారు. పంజాబ్, ఖైబర్ పాంఖ్తూంక్వాలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని చెప్పారు. త్వరగా ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

మరోపక్క, పాక్ ఆర్మీ మద్దతున్న పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ఓడినట్టు ఓ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. నవాజ్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. ఓటమి విషయం తెలిసి నవాజ్, తన కూతురు మరియం, సోదరుడు షెహబాజ్‌తో కలిసి కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయినట్టు పేర్కొంది. 

ప్రస్తుతం జైల్లో ఉన్న పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. పార్టీ ఎన్నికల గుర్తైన బ్యాట్ సింబల్‌ను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు ఈసీ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. పాక్ జాతీయ అసెంబ్లీలోని మొత్తం 336 స్థానాల్లో 266 సీట్లలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. మహిళలు, మైనారిటీలకు 70 సీట్లను రిజర్వ్ చేశారు.

More Telugu News