Revanth Reddy: సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవద్దు.. హెచ్చరించిన రేవంత్‌రెడ్డి

  • మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ కనెక్షన్ల తనిఖీ 
  • డిస్కం డైరెక్టర్‌ను విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం
  • ఎస్ఈపై బదిలీ వేటు
  • ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక
CM Revanth Reddy warns govt employees for their own decisions

ప్రజలను ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా తోచినట్టుగా  సొంత నిర్ణయాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల రైతుల వ్యవసాయ కనెక్షన్లు తనిఖీ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కనెక్షన్ల తనిఖీ అంశం చర్చకు వచ్చింది. 


రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పింది ఎవరని, ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరని ట్రాన్స్‌‌కో సీఎండీ రిజ్వీని సీఎం ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా? అని ఆరా తీశారు. సమీక్షకు హాజరైన డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందన్నారు. శాఖాపరమైన నిర్ణయం లేకుండానే డిస్కం డైరెక్టర్ (ఆపరేషన్స్) జే.శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చారని, ఆయన ఆదేశాలతో ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి తనిఖీలు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలగించినట్టు వివరించారు. అలాగే ఎస్ఈ మూర్తిని బదిలీ చేసినట్టు సీఎంకు చెప్పారు. స్పందించిన సీఎం రేవంత్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని, సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు పొగొట్టుకోవద్దని హెచ్చరించారు.

More Telugu News