Sarfaraz Khan: సర్ఫ్‌రాజ్‌కు టీమిండియా పిలుపు.. భావోద్వేగానికి గురైన తండ్రి.. వీడియో ఇదిగో!

Sarfaraz Khan father Naushad got emotional after son got place in Team India
  • ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ను పిలిచిన సెలక్టర్లు
  • గాయం కారణంగా జడేజా, రాహుల్ తప్పుకోవడంతో సర్ఫరాజ్‌కు చోటు
  • సర్ఫరాజ్‌పై నమ్మకముంచిన ప్రతి ఒక్కరికీ తండ్రి నౌషద్ కృతజ్ఞతలు

ముంబై క్రికెటర్ సర్ఫరాజ్‌ఖాన్‌కు టీమిండియా నుంచి పిలుపు రావడంపై ఆయన తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టుకు జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు ఎంతోకాలంగా జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌కు అవకాశం కల్పించారు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌ గాయం కారణంగా తప్పుకోవడంతో సర్ఫరాజ్‌కు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. 
 
దేశవాళీ క్రికెట్‌లో గత కొంతకాలంగా పరుగుల వర్షం కురిపిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్ భారత జట్టులో స్థానం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు. ఈ నెల మొదట్లో అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో సర్ఫరాజ్ 161, 4, 55 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 

జాతీయ జట్టులోకి పిలుపు రావడంతో సర్ఫరాజ్ తండ్రి నౌషద్‌ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. ఓ వీడియోలో ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. అందులో నౌషద్ మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్‌కి టెస్టు పిలుపు వచ్చిన సంగతి మీకందరికీ తెలుసు.  ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌కి. అతడు అక్కడే ఎదిగాడు. అలాగే, అతడికి అనుభవాన్ని ఇచ్చిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి, బీసీసీకి, సర్ఫరాజ్‌పై నమ్మకముంచిన సెలక్టర్లకు, సర్ఫరాజ్ కోసం ప్రార్థించిన, అతడికి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అని పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యారు. సర్ఫరాజ్ ఎల్లప్పుడూ దేశానికి అడతాడని, జట్టు విజయాల్లో పాలుపంచుకుంటాడని ఆశిద్దామని కోరారు.

  • Loading...

More Telugu News