Supreme Court: భవిష్యత్‌లో సామాన్యులకు అందుబాటులోకి సుప్రీంకోర్టు కేస్ ఫైల్స్: చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్

Supreme Court files to be accessible to common people in digital form in future says Chief Justice DY Chandrachud
  • 36,308 కేసులకు సంబంధించిన రిపోర్టులు అందుబాటులోకి వస్తాయన్న సీజే
  • సుప్రీంకోర్ట్ 75వ వార్షికోత్సవ వేడుకలపై పలు అంశాలపై మాట్లాడిన డీవై చంద్రచూడ్
  • ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ.. నూతన వెబ్‌సైట్ ప్రారంభోత్సవం
భవిష్యత్‌లో సుప్రీంకోర్టు తన వద్ద ఉన్న డిజిటల్ డేటాను క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయంగా దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఒక సంస్థగా సుప్రీంకోర్టు సామర్థ్యం మున్ముందు కూడా పటిష్ఠంగా ఉండాలంటే సవాళ్లను గుర్తించి, పరిష్కారం దిశగా చర్చలు మొదలుపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. 

సుప్రీం కోర్ట్ డిజిటల్ రిపోర్టులు భవిష్యత్‌లో ప్రజలకు ఉచితంగా డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 1950 నుంచి 36,308 కేసులకు సంబంధించిన రిపోర్టులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 519 పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్‌, బుక్‌మార్క్, యూజర్ ఫ్రెండ్లీ, ఓపెన్ యాక్సెస్‌తో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 

సుప్రీంకోర్ట్ 75 వసంతాల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలను ప్రారంభించారు. సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, ఇతర న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ రోజు ప్రత్యేకమైన సందర్భమని, భారత రాజ్యాంగం ద్వారా ప్రజలు తమకు తాము ఈ కోర్టును అందించుకున్నారని డీవై చంద్రచూడ్ అన్నారు. దేశ పౌరుల మధ్య పరస్పర గౌరవం గురించి రాజ్యాంగం చెబుతోందని పేర్కన్నారు. భవిష్యత్‌లో దేశానికి సంబంధించిన రియల్-టైమ్ న్యాయ సమాచారాన్ని, సుప్రీంకోర్టు పర్యవేక్షణ కోసం అధునాతన సాంకేతికతతో కూడిన వార్‌రూమ్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్ ‘సుస్వాగతం’ ఉపయోగించి 1.23 లక్షల ఫైల్స్‌ను డిజిటల్‌గా మార్చామని, వీటన్నింటినీ సురక్షితమైన, తిరుగులేని క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయంగా మార్చనున్నట్టు ఆయన చెప్పారు. 

ఇక సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా కీలకమైన స్థానాల్లో పెద్ద సంఖ్యలో మహిళా నిపుణులు కనిపిస్తున్నారని అన్నారు. ఇంతకుముందు న్యాయవాద వృత్తి పురుషులకు మాత్రమే పరిమితమై ఉండేదని, ఇప్పుడు జిల్లా న్యాయవ్యవస్థలో 36 శాతం స్త్రీలే ఉన్నారని అన్నారు. 

ఇటీవల జడ్జిలుగా ఎంపికైనవారిలో మహిళలు 50 శాతానికి పైగా ఉన్నారని ప్రస్తావించారు. జడ్జిలకు సాయం అందించే క్లర్కుల్లో 41 శాతం మంది మహిళలేనని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే 75 వసంతాల వేడుకలు జరుపుతున్నారు.
Supreme Court
Chief Justice DY Chandrachud
Supreme Court Turns 75
Narendra Modi

More Telugu News