Dasoju Sravan: రేవంత్ రెడ్డి ఓసారి అద్దంలో ముఖం చూసుకోవాలి: దాసోజు శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు

  • తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి అని ఘాటు విమర్శ
  • మోదీ, రేవంత్ రెడ్డి బంధాన్ని కాంగ్రెస్ బయటపెట్టాలని డిమాండ్
  • కేసీఆర్ వయస్సుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడారని ఆగ్రహం
  • హామీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి అసహనం ప్రదర్శిస్తున్నారని విమర్శ
Dasoju Sravan hot comments on CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసారి ముఖం అద్దంలో చూసుకోవాలని... తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్‌లో ఆయన శనివారం నాడు మాట్లాడుతూ... కేసీఆర్‌పై ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు. అధికార అహంకారం కనిపిస్తోందని... తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణను సాధించిన వ్యక్తి అని కూడా చూడకుండా... వయస్సుకు గౌరవం ఇవ్వకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

గల్లీ లీడర్ స్థాయి కంటే దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తెచ్చినందుకు... అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌కు గోరీ కడతావా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై ఇలాగే మాట్లాడితే తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి నాలుక చీరేస్తారని హెచ్చరించారు. 

ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అసహనం ఎందుకో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి మాట తీరును మార్చాలని సూచించారు. కాంగ్రెస్ వాళ్లకు కోపం వస్తే ఐదేళ్ల లోపే ముఖ్యమంత్రిగా దించేస్తారని హెచ్చరించారు. కేసీఆర్ కంటే మంచి పాలన అందించడంలో పోటీ పడాలని సీఎంకు సూచించారు.

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల బంధాన్ని కాంగ్రెస్ బయటపెట్టాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. క్రమంగా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు బయటకు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఎంపిక, రిపబ్లిక్‌ డే వేడుకల్లో తెలంగాణ శకటం, అదానీతో ఒప్పందం, తెలంగాణకు ఐపీఎస్‌ల కేటాయింపు... ఇలా ప్రతి అంశం రేవంత్ రెడ్డి-నరేంద్ర మోదీ బంధాన్ని రుజువు చేస్తున్నాయని ఆరోపించారు.

More Telugu News