Rohan Bopanna: 43 ఏళ్ల వయసులో... ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న

Rohan Bopanna wins Australian Open grand slam doubles title at the age of 43
  • నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పురుషుల డబుల్స్ ఫైనల్
  • విజేతగా నిలిచిన రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ
  • ఇటలీ ద్వయం బొలెల్లి- వావోసోరి జంటపై వరుస సెట్లలో విజయం
  • కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ సాధించిన రోహన్ బోపన్న
  • అతి పెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ గెలిచిన ఆటగాడిగా రికార్డు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇవాళ జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6 (7-0), 7-5తో ఇటలీ ద్వయం సిమోన్ బొలెల్లి- ఆండ్రియా వావోసోరిపై విజయం సాధించింది. రెండు సెట్లు హోరాహోరీగా సాగినప్పటికీ చివరికి బోపన్న-ఎబ్డెన్ జోడీదే పైచేయిగా నిలిచింది. 

రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు, గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన అతి పెద్ద వయసు ఆటగాడిగా బోపన్న అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ విజయంతో బోపన్న-ఎబ్డెన్ లకు ట్రోఫీతో పాటు రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.

మహిళల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్న అరియానా సబలెంకా

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది. డిఫెండింగ్ చాంప్ అరియానా సబలెంకా ఈ ఏడాది కూడా మహిళల విజేతగా నిలిచింది. గతేడాది టైటిల్ నెగ్గిన సబలెంకా... నేడు జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన ఝెంగ్ కిన్వెన్ పై సునాయాసంగా నెగ్గింది. ఏకపక్షంగా సాగిన ఈ టైటిల్ పోరులో సబలెంకా 6-3, 6-2తో విజయం సాధించింది.
Rohan Bopanna
Australian Open
Doubles Title
Mens
Grand Slam
India

More Telugu News