Revanth Reddy: తెలంగాణలో కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy orders to cast census
  • ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
  • ఓవర్సీస్ స్కాలర్‍షిప్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్న రేవంత్ రెడ్డి
  • ఎడ్యుకేషన్ హబ్‍ల నిర్మాణానికి కార్పోరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచన
తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా... ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని, వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని సూచించారు. స్కూల్ భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్‍షిప్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని... ఈ పథకం గతంలో కంటే ఎక్కువ మందికి అందేలా చూడాలన్నారు. ర్యాంకింగ్స్ ఆధారంగా విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలను గుర్తించి ప్రేమ్ వర్క్ తయారు చేయాలని ఆదేశించారు. ఆయా యూనివర్సిటీలలో చదివే మన విద్యార్థులకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలతో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్‍గా తీర్చిదిద్దాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఇంటిగ్రేటెడ్ హబ్ నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎక్కువమంది విద్యార్థులు ఒకేచోట చదువుకుంటే వారిలో పోటీతత్వం పెరుగుతుందన్నారు.

ఎడ్యుకేషన్ హబ్‍ల నిర్మాణానికి కార్పోరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని... కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్‌ను సమీకరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా కార్పోరేట్ సోషల్ రెస్బాన్సిబిలిటీ నిధులు సమీకరించాలన్నారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News