Padma Vibhushan: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్

Padma Vibhushan to former Vice President Venkaiah Naidu and Megastar Chiranjeevi annouced
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
  • అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఇరువురు తెలుగుతేజాలు
  • మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం 

అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కుగాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఐదుగురు వ్యక్తులకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో ఇద్దరు తెలుగువారే కావడం గమనార్హం. ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.

పద్మవిభూషణ్ అవార్డుల జాబితా ఇదే..

1. వైజయంతిమాల బాలి (కళలు) - తమిళనాడు
2. కొణిదెల చిరంజీవి (కళలు) - ఆంధ్రప్రదేశ్
3. ఎం. వెంకయ్య నాయుడు (ప్రజా సంబంధాలు) - ఆంధ్రప్రదేశ్
4. బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ) (మరణానంతరం) - బీహార్
5. పద్మాసుబ్రహ్మణ్యం (కళలు) - తమిళనాడు

కాగా పద్మభూషణ్‌ కేటగిరీలో తెలుగువారి పేర్లు లేవు. పద్మశ్రీ అవార్డుల విషయానికి వస్తే తెలంగాణకు చెందిన ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరి పేరు ఉన్నాయి. ఏపీ నుంచి ప్రముఖ హరికథా కళాకారిణి డి.ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆమె దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఇక తెలంగాణకు చెందిన వారిలో జనగాం ప్రాంతానికి చెందిన గడ్డం సమ్మయ్య(చిందు యక్షగానం కళాకారుడు), నారాయణపేట్‌ జిల్లా దామెరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్ప(బుర్రవీణ కళాకారుడు), తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలను సమకూర్చిన డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య, బంజారా జాతి జాగృతం కోసం కృషి చేస్తున్న కేతావత్‌ సోమ్‌లాల్‌, యాదాద్రి సహా పలు ఆలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ స్థపతి వేలు ఆనందాచారి ఈ జాబితాలో ఉన్నారు.

  • Loading...

More Telugu News