YS Sharmila: కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దాం.. రాష్ట్రాన్ని బతికించుకుందాం: షర్మిల

AP Congress Chief YS Sharmila Wants To Come People And Join Congress
  • కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేరాలంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ విజ్ఞప్తి
  • 9550803366కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌లో చేరాలన్న షర్మిల
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బతుకులు బాగుపడతాయని వ్యాఖ్య
  • ప్రధానిగా రాహుల్‌గాంధీ తొలి సంతకం స్పెషల్ స్టేటస్‌ పైనేనన్న షర్మిల
ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడుమీదున్న వైఎస్ షర్మిల ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండడంతో పార్టీని బలోపేతం చేసేందుకు అప్పుడే జిల్లాల పర్యటన ప్రారంభించిన షర్మిల తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. 

ఏపీ ప్రజలు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదని, ఎంతగా పతనమైందో మనందరికీ తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. హోదా వచ్చి ఉంటే బోల్డన్ని ప్రయోజనాలు కలిగి ఉండేవన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వకపోయినా, పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా, రాజధాని ఇవ్వకున్నా చంద్రబాబు, జగన్‌ మోహన్‌‌రెడ్డి మన హక్కుల్ని సాధించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. అయినప్పటికీ బీజేపీ కోసం టీడీపీ, వైసీపీ పనిచేస్తున్నాయని దుమ్మెత్తిపోశారు. 

ఏపీ నుంచి గత పదేళ్లలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించకున్నా రాష్ట్రాన్ని పాలిస్తోందని విమర్శించారు. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. తమతో చేతులు కలపాలని రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా కోరుతున్నానని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అయితే స్పెషల్ స్టేటస్ పైనే తొలి సంతకం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని, రాష్ట్రాన్ని బతికించుకుందామని పేర్కొన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో యాక్టివ్‌గా పనిచేయాలని కోరారు. సపోర్ట్ చేయాలని, 9550803366కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila
Andhra Pradesh
APCC President
Congress

More Telugu News