YV Subba Reddy: స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఇప్పుడు గగ్గోలు పెడితే ఎలా?: గంటాపై వైవీ సుబ్బారెడ్డి విమర్శలు

YV Subba Reddy comments on Ganta Srinivasa Rao and YS Sharmila
  • రాజీనామాను ఎప్పుడు ఆమోదించాలనేది స్పీకర్ పరిధిలోని అంశమన్న సుబ్బారెడ్డి 
  • రాజీనామా చేసేముందే గంటా ఆలోచించుకోవాల్సిందని వ్యాఖ్య 
  • రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని షర్మిలకు చూపించేందుకు సిద్ధమన్న వైవీ
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడం పెద్ద చర్చకు తెరలేపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం ఏమిటని గంటాతో పాటు పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజీనామాను ఆమోదించారని విమర్శిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... రాజీనామా చేసేముందే గంటా శ్రీనివాసరావు ఆలోచించుకోవాల్సిందని అన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఇప్పుడు గగ్గోలు పెడితే ఎలాగని ప్రశ్నించారు. రాజీనామాను ఎప్పుడు ఆమోదించాలనేది స్పీకర్ పరిధిలోని అంశమని చెప్పారు. 

ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆయన మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని షర్మిలకు చూపించేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లిన షర్మిలకు ఉద్దానంలో తమ ప్రభుత్వం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, తాగునీటి ప్రాజెక్ట్ కనపడలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తుందని చెప్పారు. రాజధానిని నిర్మించేందుకు డబ్బులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలను తమను అడిగితే ఎలా అని విమర్శించారు.
YV Subba Reddy
YSRCP
Ganta Srinivasa Rao
Telugudesam
YS Sharmila
Congress
AP Politics

More Telugu News