Nara Lokesh: నారా లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, టీడీపీ సీనియర్లు

Pawan Kalyan and TDP senior leaders wishes Nara Lokesh on his birthday
  • నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
  • ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథా చూపారన్న పవన్ 
  • తండ్రికి తగ్గ తనయుడు అంటూ అయ్యన్నపాత్రుడి ట్వీట్
  • మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ గంటా ఆకాంక్ష
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నారా లోకేశ్ కు జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

"తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథాను చూపారు. ప్రజా సమస్యలు చూస్తూ, రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. నారా లోకేశ్ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను" అంటూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. 

అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ... "మా పెద్దాయన స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారికి మనవడు, నారా చంద్రబాబునాయుడు గారికి తగ్గ తనయుడు, మా యువతేజం నారా లోకేశ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. తాత 2 సార్లు సీఎం, తండ్రి 3 సార్లు సీఎం... అయినా ఏనాడూ ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చలేదు. చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు... తరువాత ప్రజాసేవకు వచ్చాడు" అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 

గంటా శ్రీనివాసరావు కూడా తనదైన శైలిలో లోకేశ్ కు విషెస్ తెలిపారు. "పట్టుదలకు ప్రతిరూపం... యువగళం సారథి... నవశకానికి వారధి... రాష్ట్ర భవితకు ఆశాజ్యోతి... తండ్రికి తగ్గ తనయుడిగా, అఖిలాంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొని, ప్రజాసేవకై అనునిత్యం అంకితభావంతో పనిచేస్తున్న యువనాయకుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ గంటా ట్వీట్ చేశారు.
Nara Lokesh
Birthday
Wishes
Pawan Kalyan
Ganta Srinivasa Rao
Ayyanna Patrudu
TDP
Janasena

More Telugu News