Pakistan: పరస్పర క్షిపణి దాడుల తర్వాత కీలక పరిణామం.. పాకిస్తాన్-ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య

Pakistan and Iran agree to tone down tensions after missile attacks
  • ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు అంగీకారం కుదుర్చుకున్న ఇరుదేశాలు
  • టెలిఫోన్‌లో సంభాషించుకున్న ఇరుదేశాల విదేశాంగ మంత్రులు
  • పరస్పర క్షిపణి దాడుల తర్వాత టెన్షన్ నేపథ్యంలో కీలక పరిణామం
పరస్పర క్షిపణి దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొన్న వేళ పాకిస్థాన్, ఇరాన్‌ల మధ్య కీలక సంధి కుదిరింది. పరస్పర విశ్వాసం, సహకారం స్ఫూర్తిగా ఉద్రిక్తతలను సడలించుకునేందుకు శుక్రవారం అంగీకరించాయి. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ టెలిఫోన్‌లో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం ఇరాన్‌తో కలిసి పనిచేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతా సమస్యలపై సహకారానికి కట్టుబడి ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి నొక్కి చెప్పారని తెలిపింది. ఇరాన్‌లోని సియస్థాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని బలూచ్ ఏర్పాటువాద గ్రూపులకు సంబంధించిన స్థావరాలపై పాక్ క్షిపణి దాడులు చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

కాగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రసంస్థ జైష్ అల్-అద్ల్‌‌కు చెందిన ఉగ్ర స్థావరాలను ఇటీవల ఇరాన్ క్షిపణి దాడులతో ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ భూభాగంలోని బలూచిస్థాన్ ఏర్పాటువాద గ్రూపుల స్థావరాలపై పాక్ క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనల్లో కనీసం తొమ్మిది మంది చనిపోయినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Pakistan
Iran
missile attacks
Pakistan vs Iran Row

More Telugu News