Ganta Srinivasa Rao: రేవంత్ రెడ్డిని పొగుడుతూ.. జగన్ పై విమర్శలు గుప్పించిన గంటా శ్రీనివాస రావు

Ganta Srinivasa Rao criticises Jagan by comparing with Revanth Reddy
  • దావోస్ సదస్సులో రేవంత్ బిజీబిజీగా ఉన్నారన్న గంటా
  • పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా బిజీగా ఉన్నారని ప్రశంస
  • జగన్ మాత్రం ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను మార్చుకుంటూ బిజీగా ఉన్నారని ఎద్దేవా
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం జగన్ హాజరు కాకపోవడంపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. నెల రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ ప్రపంచ ఆర్ధిక సదస్సులో బిజీ బిజీ అయ్యారని ప్రశంసించారు. మన ముఖ్యమంత్రి మాత్రం పరిశ్రమలు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? మళ్లీ అధికారంలోకి వచ్చేస్తే చాలు... రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు అంటూ... ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా తమ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలను మార్చుకుంటూ బిజీ బిజీ అయ్యారని ఎద్దేవా చేశారు. 

ఈ ఐదేళ్ళలో నాలుగు సార్లు సమావేశాలు జరిగితే 2022లో మాత్రం ప్రపంచ ఆర్ధిక సదస్సు వంకతో ప్రత్యేక విమానంలో వయా లండన్‌ మీదుగా వెళ్లి తమ పిల్లలను కలిసిన తర్వాత దావోస్‌ సదస్సును తూతూమంత్రంగా ముగించేశారని గంటా విమర్శించారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, పరిశ్రమలు లేక యువత హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వలసలు పోతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో కొంచమైనా చలనం లేకపోవడం సిగ్గు చేటని అన్నారు.  

రాష్ట్రంలో జగన్ కక్షసాధింపు విధానాలతో సుమారు రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయని గంటా చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు కూడా ఏపీకి తరలివస్తే, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఏళ్లుగా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నారని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని... ఈ నాలుగేళ్ళ 9 నెలల కాలంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక 1,345 మంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం పట్టభద్రుల్లో నిరుద్యోగిత రేటు 24 శాతంతో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారని దుయ్యబట్టారు. మీ నాయకుల బెదిరింపులతో పెద్ద సంఖ్యలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు మూతపడేలా చేయడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారని అన్నారు. ఎన్నికలకు ముందు 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రాష్ట్ర యువతను నట్టేట ముంచేసి... వారి జీవితాలను అగమ్యగోచరంలోకి నెట్టేశారని విమర్శించారు.  

2015 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం దావోస్ సదస్సులకు హాజరై... అనేక కంపెనీలతో మాట్లాడి రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర చరిత్రలో ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. 2015 జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తూ... మన రాష్ట్ర ప్రభుత్వ విజన్‌ ఎలా ఉండబోతుందో వివరించి అందరూ రాష్ట్రం వైపు చూసేలా చేశారని కొనియాడారు. కానీ ఇప్పుడు జగన్ కు కనీసం సదస్సుకు హాజరు కావడానికే తీరికలేదని దుయ్యబట్టారు. విజనరీ లీడర్ కు, ప్రిజనరీ లీడర్ కు ఉన్న తేడా ఏమిటో ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయిందని అన్నారు. మరో మూడు నెలల తర్వాత చంద్రబాబు సీఎం కావడం... రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయమని చెప్పారు.
Ganta Srinivasa Rao
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Revanth Reddy
Congress
Davos

More Telugu News