Bill Gates: కృత్రిమ మేధపై ఉన్న భయాలను ఒక్క ముక్కతో మాయం చేసిన బిల్‌గేట్స్

Bill Gates explains how AI will change our lives in 5 years
  • ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమవుతాయన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
  • అలాంటి భయాలేమీ అవసరం లేదన్న బిల్‌గేట్స్
  • కొత్త సాంకేతికత వచ్చిన ప్రతిసారీ ఇలాంటి అపోహలు సహజమేనన్న మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో
కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అన్ని రంగాలకు పాకిపోయింది. ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఈ కృత్రిమ మేధ కారణంగా వచ్చే ఐదేళ్లలో మానవ జీవితాలు ఎలా ఉండబోతున్నాయన్నది మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత కారణంగా మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న భయాలు అలముకొన్న వేళ.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చేసిన వ్యాఖ్యలు మరింత అలజడి సృష్టిస్తున్నాయి. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో తొలి నుంచి దృఢ నిశ్చయంతో ఉన్న బిల్‌గేట్స్ ఏఐపై సానుకూల దృక్పథాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. కొత్త సాంకేతికత వచ్చిన ప్రతిసారీ ఇలాంటి భయాలు, అపోహలు సర్వసాధారణమేనని తేల్చేశారు. కొత్త సాంకేతికత ప్రతిసారీ కొత్త అవకాశాలకు దారులు తెరుస్తూనే ఉంటుందన్నారు. 1900లో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులే ఇందుకు నిదర్శనమని ఉదహరించారు. 

వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత వచ్చినప్పుడు ‘‘హే.. ప్రజలు ఏం చేయబోతున్నారు?’’ అని అందరూ ఆశ్చర్యంగా ప్రశ్నించేవారని, ఆ తర్వాత అది కొత్త ఉద్యోగాల సృష్టికి కారణమైందని గుర్తు చేశారు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో గేట్స్  మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ప్రతి ఒక్కరి జీవితాలను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా వైద్యుల వృత్తిలో భాగమై, వారు చేయడానికి ఇష్టపడని పేపర్ వర్క్ విషయంలో ఏఐ సహాయకారిగా ఉంటుందన్నారు. ఏఐకి కొత్త హార్డ్‌వేర్ అవసరం లేదు కాబట్టి దానిని యాక్సెస్ చేసేందుకు ఇంటర్నెట్ కనెక్షన్‌లో ఇప్పటికే కనెక్ట్ చేసిన ఫోన్, లేదంటే పీసీ ద్వారానే ఉపయోగించుకోవచ్చని చెబుతూ ఏఐ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదని తేల్చేశారు.
Bill Gates
Microsoft
AI
Artificial intelligence
IMF

More Telugu News