Narendra Modi: రేపు ఏపీకి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో మోదీ పర్యటన
  • లేపాక్షిలో వీరభద్ర ఆలయం సందర్శన 
  • పాలసముద్రంలో NACIN నూతన భవన సముదాయానికి ప్రారంభోత్సవం
PM Modi inaugurates inaugurates NACIN new campus in Palasamudram tomorrow

ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి ఏపీలో పర్యటించనున్నారు. రేపు (జనవరి 16) సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్) 74, 75వ బ్యాచ్ ల ట్రైనీ ఆఫీసర్లతోనూ, రాయల్ సివిల్ సర్వీస్ ఆఫ్ భూటాన్ ట్రైనీ ఆఫీసర్లతోనూ మాట్లాడనున్నారు.

మోదీ తన పర్యటన సందర్భంగా NACIN క్యాంపస్ లోని పురాతన వస్తువుల అక్రమ రవాణా అధ్యయన కేంద్రం, నార్కోటిక్స్ అధ్యయన కేంద్రం, వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ సెంటర్ లను సందర్శించనున్నారు. NACIN ప్రాంగణంలో మోదీ ఓ మొక్కను నాటనున్నారు. అక్కడి భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటించనున్నారు. 

తన పర్యటనలో 'ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం' అనే పుస్తకాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని NACINకి అక్రెడిటేషన్ సర్టిఫికెట్ ను కూడా ప్రదానం చేయనున్నారు. 

కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత లేపాక్షిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించనున్నారు.

కాగా, రాష్ట్ర విభజన చట్టం-2014 కేటాయింపుల్లో భాగంగా ఏపీకి NACIN అకాడమీని కేటాయించారు. ఈ అకాడమీ నిర్మాణానికి 2015లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. NACINకి దేశంలోనే ఇది రెండో క్యాంపస్. దీన్ని రూ.730 కోట్ల వ్యయంతో నిర్మించారు.

More Telugu News