Rinku Singh: ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహాను వెల్లడించిన రింకూ సింగ్.. అదే ఫాలో అవుతున్నట్టు వెల్లడి

  • క్రీజులో ప్రశాంతంగా ఉండి బాల్‌ను బట్టి ఆడాలని మహి భాయ్ చెప్పాడని వెల్లడించిన యువ బ్యాట్స్‌మెన్
  • అదే సలహాను పాటిస్తున్నట్టు తెలిపిన రింకూ సింగ్
  • 6వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటైపోయిందన్న టీమిండియా ఫినిషర్
Rinku Singh revealed the advice given by MS Dhoni

యువ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ రూపంలో టీమిండియాకు చక్కటి ఫినిషర్ దొరికాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అనతికాలంలో మంచి ఆటగాడిగా అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. మరో నాలుగు నెలల్లో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌ జట్టులో స్థానం సంపాదించడం కూడా దాదాపు ఖాయం అయినట్టేనని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో రింకూ సింగ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. క్రికెట్ లెజెండ్, బెస్ట్ ఫినిషర్లలో ఒకరైన ఎంఎస్ ధోనీ తనకు ఇచ్చిన సలహాలను రింకూ వెల్లడించాడు. క్రీజులో ప్రశాంతంగా ఉండి బాల్‌ని బట్టి స్పందించాలని మహి భాయ్ చెప్పాడని, తాను అదే పని చేస్తున్నట్టు తెలిపాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు పెద్దగా ఆలోచించడం లేదని, బంతిని బట్టి మాత్రమే స్పందిస్తున్నానని చెప్పాడు. మొహాలిలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించాడు.

6వ స్థానంలో బ్యాటింగ్ చేయడం తనకు అలవాటు అయ్యిందని, ఫినిషర్‌గా బ్యాటింగ్ చేసే విషయంలో సంతోషంగా ఉన్నానని రింకూ సింగ్ తెలిపాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తుండడంతో ఎక్కువ బంతులు ఆడి ఎక్కువ పరుగులు చేసే అవకాశం లేదని తనకు తాను చెప్పుకుంటుంటానని అన్నాడు. ఇక మొహాలిలో చలి పరిస్థితులను ఆస్వాదించానని, అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించిందని వివరించాడు. మ్యాచ్ అనంతరం ఈ మేరకు స్పందించారు. ఇదిలావుంచితే ఆఫ్ఘనిస్థాన్‌పై తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శివమ్ దూబేకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. కేవలం 40 బంతుల్లో 60 నాటౌట్‌తో చివరివరకు క్రీజులో ఉన్న దూబే టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

మొహాలిలో మ్యాచ్ ఆడడాన్ని ఆస్వాదించానని, కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించానని చెప్పాడు. మొదటి 2-3 బంతులు కొంత ఒత్తిడిగా అనిపించిందని, ఆ తర్వాత తాను బంతిపై దృష్టి పెట్టి ఆడానని రింకూ సింగ్ చెప్పాడు. పెద్ద సిక్సర్లు కొట్టగలననే విషయం తనకు తెలుసని, అవకాశం రావడంతో బౌలింగ్ చేశానని చెప్పాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో ఈ విషయాలను పంచుకున్నాడు. కాగా ఆఫ్ఘనిస్థాన్‌పై మ్యాచ్‌లో కేవలం 9 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రింకూ 16 పరుగులు కొట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించాడు.

More Telugu News