KTR: అభిమాని ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్!

KTR went to a fan house in Hyderabad as invited
  • బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ అనే అభిమాని ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించిన మాజీ మంత్రి
  • కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • ఆదివారం చోటుచేసుకున్న ఆసక్తికర సన్నివేశం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అభిమాని పిలుపు మేరకు అతడి ఇంటికి అతిథిగా వెళ్లారు. ఆతిథ్యాన్ని స్వీకరించి అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆసక్తికరమైన ఈ సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నగరంలోని బోరబండ బంజారానగర్‌కు చెందిన ఇబ్రహీంఖాన్‌ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. న్యూఇయర్ సందర్భంగా జనవరి 2న ‘ఎక్స్‌’లో కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంఖాన్ తన ఇంటికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. దీంతో కేటీఆర్ అతడి ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు.

అభిమాని ఇంటికి ఆతిథ్యానికి వెళ్లడంపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందించిన సేవలను గుర్తిస్తూ ఓ సాధారణ వ్యక్తి తన ఇంటికి ఆహ్వానించడం చాలా ఆనందం కలిగించిందని అన్నారు. ఇలాంటి సందర్భాలు ప్రజాజీవితంలో మరింత నిబద్ధతతో పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఇబ్రహీంఖాన్ భాయ్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. బోరబండలోని ఆయన ఇంటికి వెళ్లాను. ఆప్యాయతతో రుచికరమైన బిర్యానీ, షీర్ ఖుర్మా అందించిన అతడి కుటుంబాన్ని కలిశాను. ఆహారం, ఆతిథ్యం నచ్చాయి. వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇబ్రహీంఖాన్ సోదరుడి పిల్లలకు సహాయం చేస్తానని మాటిచ్చాను’’ అని తెలిపారు. 

కేటీఆర్ తన ఇంటికి రావడంపై ఇబ్రహీంఖాన్ స్పందిస్తూ.. దివ్యాంగులైన తమ పిల్లలకు ఆసరా పింఛను ఇప్పించాలని గతంలో ఎక్స్ వేదికగా కోరగా కేటీఆర్‌ కార్యాలయం తక్షణమే స్పందించిందని తెలిపాడు. పిల్లల చికిత్సకు అవసరమైన సాయం చేసేందుకు కేటీఆర్‌ భరోసా ఇచ్చారని గుర్తుచేసుకున్నాడు. ఇదిలావుండగా కేటీఆర్‌ వెంట జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
KTR
Hyderabad
BRS
Telangana

More Telugu News