Pregnancy Termination: భర్త మరణంతో కుంగిపోయిన మహిళ.. 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు కోర్టు అనుమతి!

  • గతేడాది అక్టోబరు 9న మహిళ భర్త మృతి
  • అప్పటికే గర్భవతి కావడంతో తొలగించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన వైనం
  • పిటిషనర్ మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగీకరించిన న్యాయస్థానం
Delhi High Court allows widow to terminate her pregnancy

భర్త మృతితో గర్భాన్ని తొలగించుకోవాలనుకున్న మహిళకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. భర్త మృతి చెందేనాటికి ఆమె గర్భవతి కావడం, భర్త మృతి తర్వాత మానసికంగా దెబ్బతినడంతో గర్భాన్ని తొలగించుకునేందుకు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె 27 వారాల గర్భంతో ఉంది.

భర్త మరణంతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురువుతోందన్న ఎయిమ్స్ వైద్యుల నివేదికను ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఆమె మానసిక సమతౌల్యాన్ని కోల్పోతోందని, తనకు తాను హాని చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ ఆత్మహత్య ధోరణి ప్రదర్శిస్తున్నందున గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిస్తున్నట్టు స్పష్టం చేశారు. 

గతేడాది అక్టోబరు 9న తన భర్త మరణించాడని, కాబట్టి తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినివ్వాలని మహిళ కోర్టును ఆశ్రయించింది. అదే ఏడాది డిసెంబరు 22న ఆమె మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించాలని ఎయిమ్స్‌ను కోర్టు ఆదేశించింది. వైద్యుల నివేదిక ఆధారంగా కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

More Telugu News