Numaish: హైదరాబాద్ లో నేటి నుంచే నుమాయిష్.. ఫిబ్రవరి 15 వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions Will Be Implemented In Hyderabad In View Of The Numaish Exhibition
  • రోజూ సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపు
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ఏర్పాటు
  • సాయంత్రం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సోమవారం (జనవరి 1) సాయంత్రం నుమాయిష్ ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. వచ్చే నెల 15 వరకు నుమాయిష్ కొనసాగనుంది. గతంలో కంటే అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 2500 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

అయితే, కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో సందర్శకులు విధిగా మాస్కు ధరించాలని సూచించారు. నుమాయిష్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి వైపు రాకపోకలు సాగించే వాహనాలను వివిధ మార్గాల్లోకి మళ్లించనున్నట్లు వివరించారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఎక్కడంటే..
  • సిద్ధి అంబర్‌బజార్‌, జాంబాగ్‌ల వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్‌ వద్ద అబిడ్స్‌ జంక్షన్‌ వైపు డైవర్ట్ చేస్తారు.
  • పోలీసు కంట్రోల్‌ రూమ్‌, బషీర్‌బాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి బీజేఆర్‌(బషీర్‌బాగ్‌) జంక్షన్‌ నుంచి అబిడ్స్‌ వైపు మళ్లిస్తారు.
  • బేగంబజార్‌ ఛత్రీ నుంచి మాలకుంటవైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్‌ నుంచి దారుస్సలాం, ఏక్‌ మినార్‌ మసీదు, నాంపల్లి వైపు డైవర్ట్‌ చేస్తారు.
  • గోషామహల్‌ రోడ్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌ వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజీ, నయాపూల్‌ వైపు పంపిస్తారు.
  • మూసాబౌలి/బహదూర్‌పుర వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను సిటీ కళాశాల వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ వైపు డైవర్ట్‌ చేస్తారు.
Numaish
Traffic Restrictions
Hyderabad
Nampally
Exhibition Grounds

More Telugu News