A340 Flight: ఫ్రాన్స్ లో విమానం నిలిపివేతపై భారత రాయబార కార్యాలయం స్పందన

A340 Flight Stopped In France And Indian Embassy Reaction
  • అధికారులు సమాచారం అందించారని వెల్లడి
  • ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకున్నామని వివరణ
  • ఆ ప్రయాణికులు యూఏఈలో పనిచేస్తుండొచ్చని ప్రకటన
మనుషుల అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) అనుమానంతో భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ విమానంలోని ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఫ్రాన్స్ లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం అందడంతో భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఆపేశామని అధికారులు సమాచారం అందించారని పేర్కొంది.

ఏ340 ఫ్లైట్ లో మొత్తం 303 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వాళ్లేనని వివరించింది. కొంతమంది మైనర్లు కూడా ఉన్నారని చెప్పింది. ప్రయాణికుల భద్రతపై ఆందోళన అక్కర్లేదని, అవసరమైన చర్యలు తీసుకున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. విమానంలోని భారత సంతతి ప్రయాణికులు యూఏఈలో పనిచేస్తుండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, భారతీయ ప్రయాణికుల తప్పులేదని నమ్ముతున్నామని పేర్కొన్నారు.

భారత ఎంబసీ ట్వీట్..
‘303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఆపేసినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలియజేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు దుబాయ్ నుంచి నికరాగువా వెళుతున్నారు. మానవ అక్రమరవాణా  జరుగుతోందనే సమాచారం అందడంతో ఫ్రెంచ్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఎంబసీ బృందానికి కాన్సులర్ యాక్సెస్‌ లభించింది. పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ప్రయాణికులను విచారిస్తున్నాం’ అంటూ భారత ఎంబసీ ట్వీట్ చేసింది.
A340 Flight
Stopped In France
Embassy
Indian Embassy
Human Trafficking

More Telugu News