Uttam Kumar Reddy: మేడిగడ్డకు రిపేర్లు మీరే చేయాలి.. లేకపోతే కఠిన చర్యలు తప్పవు: ఎల్ అండ్ టీ సంస్థకు ఉత్తమ్ వార్నింగ్

  • మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఎల్ అండ్ టీ డైరెక్టర్ పై ఉత్తమ్ ఆగ్రహం
  • రిపేర్లతో సంబంధం లేదని తప్పించుకోవాలని చూడొద్దని హెచ్చరిక
  • పూర్తి స్థాయిలో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాలన్న మంత్రి
Uttam Kumar Reddy warning to L and T on Medigadda

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ పనులను నాసిరకంగా చేపట్టారని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్ తో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... నాణ్యత లేకుండా పనులు ఎలా చేస్తారని మండిపడ్డారు. రిపేర్లతో తమకు సంబంధం లేదని ఏదో ఒక లెటర్ రాసి తప్పించుకోవాలని చూడొద్దని.... ప్రజాధనాన్ని వృథా చేసి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణమైన ఏ ఒక్కరినీ తాము వదిలి పెట్టబోమని హెచ్చరించారు. బ్యారేజీని రిపేర్ చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని తేల్చి చెప్పారు. 

బ్యారేజీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత పూర్తి స్థాయిలో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని.. ఆ బాధ్యత మొత్తం ఎల్ అండ్ టీదే అని చెప్పారు. తప్పు చేసినవాళ్లు తప్పించుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించిన సంస్థలతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ పై అసెంబ్లీలో ప్రజంటేషన్ ఇచ్చేందుకు పూర్తి వివరాలను అందించాలని చెప్పారు.

More Telugu News