Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు... అభిమానులపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

  • పల్లవి ప్రశాంత్‌పై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు
  • సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసుల వెల్లడి
  • గ్రాండ్ ఫినాలే సమయంలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవ, బస్సులపై దాడులు
  • అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదన్న సజ్జనార్
Police case against Big Boss winner

బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమోటోగా కేసు నమోదయింది. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పల్లవి ప్రశాంత్‌కు చెందిన పలువురు అభిమానుల పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు.

ఏం జరిగింది?

నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరిగిన అన్నపూర్ణ స్టూడియో వద్దకు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటించిన తర్వాత ఇరువురి అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో అక్కడ ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాలపై దాడులు చేసి హంగామా సృష్టించారు. ఆరు బస్సులను ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదని, ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడిగా భావించాల్సిందే అన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

More Telugu News