TS Assembly: అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని సంపదతో ఇస్తే అప్పులకుప్పగా మార్చారంటూ కేటీఆర్‌పై విరుచుకుపడిన భట్టి

Telangana Legislative Assembly congress vs BRS
  • గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో రచ్చ
  • మొదలుపెట్టీ పెట్టడంతోనే దాడి సరికాదని కేటీఆర్‌కు భట్టి హితవు
  • పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపాటు
  • కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియదని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ ఎద్దేవా
  • రేవంత్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీశ్‌రావు
  • సోనియాను బలిదేవత అన్నదెవరో ప్రజలకు తెలుసన్న కేటీఆర్

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. నేడు సమావేశాలు ప్రారంభం కాగానే  కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. కేటీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. మధ్యలోనే కల్పించుకున్న భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్.. 2014కు ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడామన్నారు. ప్రసంగం మొదలుపెట్టీ పెట్టడంతోనే దాడి సరికాదని కేటీఆర్‌కు హితవు పలికారు. సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. బాగు చేయాల్సిన రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షకోట్ల రూపాయలు వృథా చేశారని, పదేళ్లపాటు విధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్ఛ అనేదే లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణను రూ. 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి మండిపడ్డారు.


కల్పించుకున్న కేటీఆర్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను విధ్వంసం అంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఏమనాలి? అని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి  3 నెలల సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమేనని పేర్కొన్నారు. పదవుల కోసం పెదాలు మూసిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు.


కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అర్థం తెలియట్లేదని ఎద్దేవా చేశారు. మనం ప్రయత్నించినా వారు తెలుసుకోరని అన్నారు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్‌కు పదవులు ఇచ్చింది కాంగ్రెస్సేనని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు.


సీఎం ప్రసంగం మధ్యలో కలగజేసుకున్న హరీశ్‌రావు.. రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని కోరింది తామేనని, ఆరు కారణాలతో ఆ రోజు రాజీనామా చేశామని గుర్తు చేశారు. అప్పుడు ఒక్క పీజేఆర్ తప్ప ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్‌కు ఆ రోజు భిక్ష పెట్టింది తామేనని, తమతో పొత్తుపెట్టుకోవడం వల్లే నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.  కేటీఆర్ మాట్లాడుతూ.. సోనియాను బలిదేవత అన్నది ఎవరో అందరికీ తెలుసన్నారు. మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలు రూ. 2,500 ఎప్పుడు వేస్తారా? అని ఎదురుచూస్తున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News