Revanth Reddy: గత ప్రభుత్వాల పాపాలకు నేటి ప్రతిపక్ష నేతలదే బాధ్యత: రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Fires On Opposition Members In Assembly
  • అప్పటి ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వహించారంటూ ప్రతిపక్ష నేతలపై ఫైర్
  • కేసీఆర్ కు ఎంపీగా, మినిస్టర్ గా అవకాశమిచ్చిందే కాంగ్రెస్ పార్టీ
  • వైఎస్ఆర్ పాలనలో హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా పనిచేశారన్న సీఎం
  • గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి
‘‘గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు పదే పదే మాట్లాడుతున్నారు.. అప్పటి ప్రభుత్వంలో మీదే ప్రధాన భాగస్వామ్యం. ఆ పాపాలకు సంపూర్ణ బాధ్యత మీదే’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. మాట్లాడితే గత పాలనలో అలా జరిగింది ఇలా జరిగిందని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ యూవజన సంఘం వైస్ ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత ఎంపీగా, మంత్రిగా ఆయనను గౌరవించిందని గుర్తుచేశారు.

ఆయన కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని (హరీశ్ రావును ఉద్దేశిస్తూ) ఎమ్మెల్యేగా గెలవకున్నా మంత్రిగా చేసి ఆపై ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. గత పాలనలో పాపాలు జరిగాయంటున్నారు.. నిజంగానే పాపాలు జరిగి ఉంటే అప్పట్లో అధికారంలో భాగస్వాములుగా ఉన్నది మీరే కాబట్టి వాటికి సంపూర్ణ బాధ్యత కూడా మీదేనని కేటీఆర్ ఆరోపణలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఇప్పుడు పాలక పక్షంలో ఉన్న నేతల కంటే ప్రతిపక్ష సభ్యులే గత ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. పోతిరెడ్డి పాడుకు గండి పెట్టి నీళ్లు తరలించినపుడు ఇక్కడ ఇప్పుడున్న ప్రతిపక్ష నేతలు ఎవ్వరూ మాట్లాడలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

కీర్తిశేషులు నాయిని నర్సింహారావు అప్పట్లో కడప ఇంచార్జిగా ఉన్నారని చెప్పారు. అయితే, పోతిరెడ్డిపాడు విషయంలో కొట్లాడింది మాత్రం కీర్తిశేషులు పి.జనార్ధన్ రెడ్డి అని వివరించారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగనీయొద్దని, కృష్ణా జలాల్లో మా వాటా నీళ్లు మాకు ఇవ్వాల్సిందేనని పీజేఆర్ సొంత పార్టీపై, సొంత ప్రభుత్వంపై కొట్లాడారని తెలిపారు.


తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన ప్రభుత్వం ఏం చేసింది.. ఆర్థిక విధ్వంసం ఎలా జరిగింది, పదేళ్ల పాలనలో చేసిన వ్యవహారాలపై సంపూర్ణంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మీకు మనసుంటే.. తెలంగాణ అభివృద్ధిని నిజంగా కోరుకుంటే మా పాలనకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ చదివిన గవర్నర్ ప్రసంగానికి అభినందలు తెలపాలని అన్నారు.

లేదు మేము ఇలాగే ఉంటామని అంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడయంటూ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష సభ్యులను ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ కు సంబంధించి సహేతుకమైన సలహాలు సూచనలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తామని చెప్పారు. ప్రతిపక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆ సంప్రదాయాన్ని తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Revanth Reddy
KTR
Assembly
CM Revanth Speech
Assembly Session
Congress Party

More Telugu News