Neeraj Kumar: మధ్యప్రదేశ్ నూతన సీఎం సీతమ్మ తల్లిని అవమానించారు: జేడీ(యూ) ఎమ్మెల్సీ నీరజ్ కుమార్

JDU MLC Neeraj Kumar slams newly appointed Madhya Pradesh CM Mohan Yadav
  • మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయం
  • నూతన సీఎంగా మోహన్ యాదవ్ నియామకం
  • బీజేపీ నేతలు నకిలీ సనాతన వాదులు అంటూ నీరజ్ కుమార్ ధ్వజం
మధ్యప్రదేశ్ నూతన సీఎంగా నియమితుడైన బీజేపీ నేత మోహన్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. మోహన్ యాదవ్ సీతమ్మ తల్లిని అవమానించారంటూ జేడీ (యూ) ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఆరోపించారు. సీతా మహాసాధ్విపై మోహన్ యాదవ్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో క్లిప్పింగ్ ను కూడా నీరజ్ కుమార్ పంచుకున్నారు. 

"రాముడు సీతకు తలాఖ్ చెప్పేశాడని మోహన్ యాదవ్ అంటున్నారు. అంతేకాదు, ఆమె భూమిలోకి వెళ్లిపోలేదని, రాముడి ముందు ఆత్మహత్య చేసుకుందని కూడా ఆయన చెబుతున్నారు. జగజ్జనని సీతకు ఇంతకంటే అవమానం ఇంకేం ఉంటుంది? సీత లేని రాముడిని ఊహించుకోలేం. కానీ ఈయన మాత్రం సీత రాముడి నుంచి విడాకులు తీసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు" అంటూ మోహన్ యాదవ్ పై నీరజ్ కుమార్ ధ్వజమెత్తారు. 

సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నామని చెప్పే నకిలీ వ్యక్తులు ఈ బీజేపీ నేతలు అంటూ మండిపడ్డారు. అందుకు మోహన్ యాదవ్ వ్యాఖ్యలే ప్రబల నిదర్శనం అని అన్నారు. బీజేపీ నేతలు ఎవరైతే సనాతన ధర్మాన్ని ఎంత ఎక్కువగా అవమానిస్తారో వారికే అత్యధిక గుర్తింపు లభిస్తోంది, అలాంటివారే ఎక్కువగా లాభపడుతున్నారని నీరజ్ కుమార్ విమర్శించారు. 

"అందుకు ఉదాహరణ మోహన్ యాదవ్... ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనను ముఖ్యమంత్రిగా నియమించారు... ఇదీ బీజేపీ గుట్టు" అంటూ నీరజ్ కుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు.
Neeraj Kumar
Mohan Yadav
Sita
Lord Rama
Chief Minister
Madhya Pradesh
JDU
BJP

More Telugu News