IPL: ఐపీఎల్ వేలంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితా విడుదల

  • వేలానికి అందుబాటులో మొత్తం 333 మంది ఆటగాళ్లు
  • జాబితాలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు
  • రూ.2 కోట్ల బేస్ ధరతో అందుబాటులో ఉన్న ఆస్ట్రేలియా స్టార్లు ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్
  • వరల్డ్ కప్‌లో అదరగొట్టిన రచిన్ రవీంద్ర బేస్ ధర కేవలం రూ.50 లక్షలు
List of players available in IPL auction released

ఐపీఎల్ 2024 మినీ వేలంలో కొనుగోలుకు అందుబాటులో ఉండనున్న ఆటగాళ్ల జాబితా విడుదలైంది. డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనున్న  వేలంలో  మొత్తం 333 మంది ప్లేయర్లు  అందుబాటులో ఉన్నారు. అందులో 214 మంది ఇండియన్ క్రికెటర్లు కాగా 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో క్యాప్డ్ ప్లేయర్లు 116 మంది, అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ 215 మంది అని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. గరిష్ఠంగా 77 స్లాట్‌లు అందుబాటులో ఉండగా విదేశీ ఆటగాళ్లకు 30 వరకు స్లాట్‌లు ఉన్నాయని వివరించింది.

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ కూడా అందుబాటులో ఉన్నారు. 119 మంది విదేశీ ఆటగాళ్ల జాబితాలో ఈ ముగ్గురు అగ్రస్థానంలో ఉన్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌ను ఐపీఎల్ 2023కి ముందు ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. 2016, 2017 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు. కానీ ఆ తర్వాత మళ్లీ ఏ జట్టూ పట్టించుకోలేదు. అయితే ఈసారి వేలంలో డిమాండ్ ఉండొచ్చనే అంచనాలున్నాయి. మిచెల్ స్టార్క్ 2018 తర్వాత మొదటిసారి వేలానికి వచ్చాడు. ఇక ప్యాట్ కమ్మిన్స్ అంతర్జాతీయ నిబంధనల కారణంగా ఐపీఎల్ 2023 నుండి వైదొలిగాడు. కాగా స్టార్క్, కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ ముగ్గురూ తమ బేస్ ధరను రూ. 2 కోట్లుగా నమోదు చేసుకున్నారు. రూ.2 కోట్ల బేస్ ధరలో మొత్తం 23 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఆస్ట్రేలియా ప్లేయర్లు జాస్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, జాస్ ఇంగ్లిస్ ఉన్నారు.

ఆటగాళ్ల జాబితా ఇదే..

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌లో అద్భుతంగా ఆడిన డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర వరుసగా రూ. 1 కోటి, రూ. 50 లక్షల బేస్ ధరతో అందుబాటులో ఉన్నారు. మిచెల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక రచిన్ రవీంద్ర వచ్చే ఏడాది అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా విషయానికి వస్తే పేసర్ గెరాల్డ్ కోయెట్జీ రూ. 2 కోట్ల బేస్ ధరకు తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇతర ఆటగాళ్ల విషయానికి వస్తే శ్రీలంక ఆటగాళ్లు వనిందు హసరంగా, దిల్షాన్ మధుశంక పేర్లు నమోదు చేసుకున్నారు. 

భారత ఆటగాళ్ల విషయానికి వస్తే శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్‌ రూ. 2 కోట్ల బేస్ ధరతో పేర్లు నమోదు చేసుకున్నారు. ఠాకూర్, ఉమేష్ యాదవ్‌లను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో రాణించలేకపోయిన హర్షల్‌ పటేల్‌ను ఆర్సీబీ వదులుకుంది. ఇక శివమ్ మావి, కార్తీక్ త్యాగి, కమలేష్ నాగర్‌కోటి వంటి పేసర్ల బేస్ ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంది. కాగా 10 ఫ్రాంచైజీలు ఈసారి ఏకంగా రూ. 262.95 కోట్ల వరకు ఆటగాళ్ల కోసం ఖర్చు చేయనున్నాయి.

More Telugu News