Cyclone Michaung: స్పీడు పెంచిన 'మిగ్జామ్'... నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబరు ప్రమాద హెచ్చరిక

Cyclone Michaung moves with 10 kmph
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  తీవ్ర తుపాను
  • ఈ మధ్యాహ్నం వరకు గంటకు 8 కి.మీ వేగంతో పయనం
  • గత 6 గంటలుగా 10 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న వైనం
  • నిజాంపట్నం హార్బర్ వద్ద ఈదురుగాలులతో భారీ వర్షం
  • హార్బర్ సమీప ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న అధికారులు
  • తిరుమలలో 24 గంటల వ్యవధిలో 10 సెం.మీ వర్షపాతం 
నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన మిగ్జామ్ తీవ్ర తుపాను ఏపీ తీరం దిశగా పయనిస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తుపాను, గత 6 గంటలుగా 10 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. 

ప్రస్తుతం ఇది చెన్నైకి ఈశాన్యంగా 100 కి.మీ దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటుతుందన్న అంచనాల నేపథ్యంలో, నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. నిజాంపట్నం తీరంలో ప్రస్తుతం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. హార్బర్ సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. 

అటు, మిగ్జామ్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోనూ భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమల ఆకాశగంగ, గోగర్భం, పాపవినాశనం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టంతో తొణికిసలాడుతున్నాయి.
Cyclone Michaung
Bay Of Bengal
Nizampatnam
Tirumala
Andhra Pradesh

More Telugu News