Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ గా మళ్లీ ద్రావిడే... కాంట్రాక్టు పొడిగింపునకు ఓకే చెప్పిన వాల్

BCCI extends Rahul Dravid tenure as head coach for Team India
  • వరల్డ్ కప్ తో ముగిసిన ద్రావిడ్ పదవీకాలం
  • కొనసాగేందుకు సుముఖంగా లేడంటూ వార్తలు
  • ద్రావిడ్ తో బీసీసీఐ సంప్రదింపులు సఫలం
  • ద్రావిడ్ తో పాటు ఇతర సహాయక సిబ్బంది కాంట్రాక్టు కూడా పొడిగింపు
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పొడిగించింది. దాంతో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు కూడా ద్రావిడే కోచ్ గా కొనసాగుతాడు.

వాస్తవానికి కోచ్ గా ద్రావిడ్ పదవీకాలం వరల్డ్ కప్ తో ముగిసింది. మళ్లీ కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ సుముఖంగా లేడంటూ వార్తలు వచ్చాయి. అయితే, పలు సంప్రదింపుల అనంతరం కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ అంగీకరించడంతో బీసీసీఐ ప్రకటన చేసింది. 

టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతాడని, ఇతర సహాయక సిబ్బంది కాంట్రాక్టును కూడా పొడిగిస్తున్నామని బోర్డు వెల్లడించింది. ద్రావిడ్ తో చర్చలు ఫలప్రదం అయ్యాయని తెలిపింది. 

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ, రాహుల్ ద్రావిడ్ విజన్, ప్రొఫెషనలిజమ్ టీమిండియా విజయాలకు మూలస్తంభాల వంటివని పేర్కొన్నారు. ద్రావిడ్ సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి భారత క్రికెట్ జట్టును తీర్చిదిద్దాడని కొనియాడారు. ద్రావిడ్ వ్యూహాత్మక మార్గదర్శకత్వానికి టీమిండియా ప్రదర్శనే గీటురాయి అని వివరించారు. హెడ్ కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ అంగీకరించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని రోజర్ బిన్నీ తెలిపారు. ద్రావిడ్ కోచ్ గా టీమిండియా విజయ ప్రస్థానం కొనసాగుతుందనడంలో తనకెలాంటి సందేహం లేదని అన్నారు. 

బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ... టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కంటే మెరుగైన వ్యక్తి మరొకరు లేరని స్పష్టం చేశారు. ప్రతిభ పరంగానూ, నిబద్ధత పరంగానూ కోచ్ గా ద్రావిడ్ తనను తాను నిరూపించుకున్నారని కొనియాడారు. ఇప్పుడు టీమిండియా అన్ని ఫార్మాట్లలో శక్తిమంతమైన జట్టుగా రూపొందిందని, మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్ లో మన జట్టుకు అగ్రస్థానం ద్రావిడ్ విజన్ కు ప్రత్యక్ష నిదర్శనం అని కితాబునిచ్చారు.
Rahul Dravid
Coach
Team India
BCCI

More Telugu News