AB de Villiers: హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కి ఆడబోతున్నాడనే వార్తలపై స్పందించిన ఏబీ డివిలియర్స్

AB de Villiers reacts to the news that Hardik Pandya is going to play for Mumbai Indians
  • పాండ్యా తిరిగి ముంబైకి వెళ్తాడని అనిపిస్తోందని వ్యాఖ్య
  • రోహిత్  కెప్టెన్సీ వదులుకొని పాండ్యాకు అప్పగిస్తాడా అని సందేహం వ్యక్తం చేసిన ‘మిస్టర్ 360’
  • రోహిత్‌పై భారాన్ని తగ్గించేందుకు ఇదొక వ్యూహం కూడా కావొచ్చని విశ్లేషణ
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ తిరిగి దక్కించుకోబోందా?.. అనే ప్రశ్నకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల నుంచి ఇందుకు సంబంధించిన రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కి ఆడబోతున్నాడని సదరు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే ఐపీఎల్ చరిత్రలో ఆటగాళ్ల బదిలీలో అతిపెద్దది కానుంది. ఈ రిపోర్టులపై దక్షిణాఫ్రికా దిగ్గజం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికరంగా స్పందించాడు.

‘‘ అక్కడ ఖచ్చితంగా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ హార్ధిక్ పాండ్యా తిరిగి ముంబైకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అది వారికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కావొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్. ముంబై ఇండియన్స్‌కి నాయకత్వం వహించడం అంటే అతడికి ఇష్టమని మనకు తెలుసు. మరి పాండ్యా వస్తే కెప్టెన్‌గా తప్పుకుంటాడా, హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగిస్తాడా అనేది నా ఉద్దేశ్యం. ఇలా ఎందుకు అంటున్నానంటే పాండ్యా కీలక ఆటగాడు. టీ20ల్లో టీమిండియాకి కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు’’ అని ఏబీ డివిలియర్స్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ విధంగా పేర్కొన్నాడు.

రోహిత్ తన కెప్టెన్సీ వదులుకొని హార్దిక్‌కు అప్పగిస్తాడా అని సరదాగా అనిపించింది. టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ భారాన్ని మోస్తున్నాడని, బహుశా ఇది కూడా ఒక ఎత్తుగడ కావొచ్చని డివిలియర్స్ విశ్లేషించాడు. కాగా ముంబై ఇండియన్స్‌ని వీడిన తర్వాత హార్ధిక్ పాండ్యా మరింత స్టార్‌గా మారిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఒకసారి టైటిల్‌ని గెలిపించడంతోపాటు వరుసగా రెండోసారి జట్టుని ఫైనల్‌కు కూడా తీసుకెళ్లాడు. పాండ్యా నిజంగానే తిరిగి ముంబై ఇండియన్స్‌కి వస్తే కీలక ఆటగాడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
AB de Villiers
Rohit Sharma
Hardik Pandya
Mumbai Indians
Gujarat titans
IPL 2024

More Telugu News