మాకు 80 సీట్ల కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా.. కేసీఆర్ విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధమే: రేవంత్ రెడ్డి సవాల్
- కేసీఆర్ బక్కోడు కాదు.. బకాసురుడు అన్న రేవంత్
- లక్ష కోట్ల తెలంగాణ సంపద మింగేశారని ఆరోపణ
- గజ్వేల్ లో వ్యతిరేకత కారణంగానే కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా
కొడంగల్ లో తనపై కేసీఆర్ ఎన్నో విమర్శలు చేశారని, తాను అబద్ధాలు చెపుతానని అన్నారని మండిపడ్డారు. ఆయన చెప్పేదే నిజమైతే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ మాదిరి అబద్ధాల టెస్టుకు తాను సిద్ధమని చెప్పారు. గజ్వేల్ లో వస్తున్న వ్యతిరేకత కారణంగానే కామారెడ్డికి కేసీఆర్ పారిపోయారని అన్నారు. గజ్వేల్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ ఆదాయం ఎంత? ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించారు.
అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని రేవంత్ అన్నారు. వందలాది మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన తెలంగాణ... దగాకోరులు, దొంగలు, దోపిడీదారుల చేతుల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయం కేసీఆర్ కు పట్టుకుందని... అందుకే కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 80 సీట్ల కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా... కేసీఆర్ వేసే ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.