Daggubati Purandeswari: ఆ విషయంలో కేసీఆర్ మాట తప్పారు: హైదరాబాద్‌లో పురందేశ్వరి

Purandeswari says kcr accepted corruption in dalith bandu
  • దళితబంధులో అవినీతి జరుగుతోందని కేసీఆర్ ఒప్పుకున్నారన్న పురందేశ్వరి
  • లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఆ హామీని నెరవేర్చలేదని విమర్శలు
  • డబుల్ బెడ్రూం సహా ఎన్నో హామీలను కేసీఆర్ విస్మరించారని ఆరోపణలు
  • కేసీఆర్ కట్టిన ఆ డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కేంద్రం డబ్బులతోనే అని వెల్లడి
  • చార్మినార్‌లోనూ పురందేశ్వరి ఇంటింటి ప్రచారం
కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దళితబంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తమ మిత్రపక్ష జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రేమ్ కుమార్‌‌ని గెలిపించాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి కూడా మంచి మద్దతు ఉంటుందని వెల్లడించారు. తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని విమర్శించారు.

బీజేపీ, జనసేనలు ప్రజాసమస్యలపై నిలదీసే పార్టీలని, ఈ పార్టీల అభ్యర్థులను ఆదరిస్తే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గుర్తించాలన్నారు. మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గురించి ప్రజలు ఓసారి ఆలోచించాలని సూచించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. పేద ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని కూడా నెరవేర్చలేదన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9 లక్షల దరఖాస్తులు రాగా 50 వేలు మాత్రమే నిర్మించారన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేసి, మూడు కోట్ల ఇళ్లు నిర్మించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయన్నారు. 

దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దళితబంధు పథకంలో భారీ అవినీతి జరుగుతోందన్నారు. దీనిని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారన్నారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలలో ఉపాధ్యాయులకు వేలపోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయటం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చామని చెప్పి కేసీఆర్ ఓట్లు అడగగలరా? అని ప్రశ్నించారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ బీజేపీతోనే సాధ్యమన్నారు. పురందేశ్వరి చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తరఫున కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
Daggubati Purandeswari
Andhra Pradesh
Telangana Assembly Election
BJP

More Telugu News