Satyavathi Rathod: బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దలు రావాల్సిందే: సత్యవతి రాథోడ్

  • బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ.400కే అందజేస్తామన్న సత్యవతి రాథోడ్
  • కాంగ్రెస్ పార్టీకి పదకొండు అవకాశాలిచ్చినా చేసిందేమీ లేదని విమర్శలు
  • ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటి పథకాలు రాష్ట్రంలో తప్పా మరెక్కడా లేవన్న సత్యవతి రాథోడ్
Satyavathi Rathod campaign in in mahaboobabad

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ.400కే అందజేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ పెద్దలు రావాల్సిందేనని, కానీ బీఆర్ఎస్ ఇక్కడి పార్టీయే అన్నారు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి కాదు... పదకొండు అవకాశాలు ఇచ్చినా చేసిందేమీ లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటి పథకాలు రాష్ట్రంలో తప్పా మరెక్కడా అమలు కావడం లేదన్నారు. 2014కు ముందు ఉన్న... ప్రస్తుతం ఉన్న మానుకోటను ఒక్కసారి బేరీజు వేసుకోవాలన్నారు.

సీఎం కేసీఆర్ పాలనలో మానుకోటను జిల్లాను చేసుకున్నామని, అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పుడైనా రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేయాలనే ఆలోచన వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేవాళ్లం కాదని, ఇప్పుడు అక్కడే ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. మానుకోటలో 100 పడకల ఆసుపత్రిని 365 పడకల ఆసుపత్రి చేసుకున్నామన్నారు. మహబూబాబాద్‌కు కేసీఆర్ రూ.50 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించారన్నారు. ఈ పనులు పూర్తయితే మానుకోట రూపురేఖలు మారిపోతాయన్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో సిలిండర్‌ ధర మూడింతలు పెరిగిందన్నారు.

More Telugu News