వాంఖడేలో ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండిపోయారు.. టీమిండియా గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందన ఇదే..
- ప్రశాంతంగా ఉండి చేయాల్సిన పని చేశామని వ్యాఖ్య
- విలియమ్సన్-మిచెల్ పార్టనర్‌షిప్‌తో ఒత్తిడి అనిపించిందని వెల్లడి
- విరాట్, అయ్యర్, షమీపై రోహిత్ ప్రశంసల జల్లు
ముంబై వాంఖడే స్టేడియంలో ఎంతో క్రికెట్ ఆడానని, ఈ మైదానంలో ఎంతపెద్ద స్కోర్ అయినా ఏమాత్రం అలసత్వంగా ఉండకూడదని రోహిత్ అన్నాడు. ప్రశాంతంగా ఉండి చేయాల్సిన పనిని త్వరగా చేయాలని, ఈ మ్యాచ్‌లో అదే చేశామని వివరించాడు. ఒత్తిడిగా అనిపించినప్పటికీ, ఇంగ్లండ్‌పై మ్యాచ్ లో 230 పరుగులే చేసినా అప్పుడు మా బౌలర్లు ఆడుకున్నారు కాబట్టి, ఈ మ్యాచ్ కూడా గెలుస్తామనే నమ్మకం ఉందని చెప్పాడు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో హిట్‌మ్యాన్ ఈ విధంగా స్పందించాడు. ఒత్తిడి లేదని చెప్పలేనని, సెమీఫైనల్ కావడంతో అదనపు ఒత్తిడి ఉందని, ఓడిపోతే ముగింపుపడుతుందని తెలుసునని అన్నాడు. లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో చేసిందే చేశామని వివరించాడు.
‘‘ మేము ఇబ్బందుల్లో పడ్డామని చెప్పడం కష్టమే అవుతుంది. అయితే విలియమ్సన్, మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ సమయంలో మేము ప్రశాంతంగా ఉండటం చాలా దోహదపడింది. మిడిల్ ఓవర్లలో కివీస్ ఆధిపత్యం చెలాయించడంతో వాంఖడేలో ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తిరిగి మ్యాచ్ భారత్ చేతుల్లోకి రావడానికి కేవలం ఒక్క వికెట్ అవసరమైంది’’ అని రోహిత్ వివరించాడు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, కుర్రాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారని వివరించారు. విరాట్, శ్రేయాస్ అయ్యర్, గిల్‌పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు.