Kinjarapu Ram Mohan Naidu: చంద్రబాబును తిట్టడం తప్ప ఈ మంత్రులకు మరో ఆలోచన లేదు: రామ్మోహన్ నాయుడు

  • మంత్రులు ప్రజలను పట్టించుకోవడంలేదన్న రామ్మోహన్
  • రాష్ట్రంలో రైతాంగం వర్షాల్లేక అల్లాడుతోందని వెల్లడి
  • ప్రభుత్వంలో ఒక్కరు కూడా రైతుల గురించి మాట్లాడడంలేదని ఆగ్రహం
  • శ్రీకాకుళంను కరవు జిల్లాగా ప్రకటించాకే సీఎం జిల్లాలో అడుగుపెట్టాలని స్పష్టీకరణ
 Ram Mohan Naidu take a dig at YCP ministers

టీడీపీ యువ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును తిట్టడం తప్ప ఈ మంత్రులకు మరో ఆలోచన లేదని అన్నారు. చంద్రబాబుపై ఏ విధంగా కేసులు పెట్టించాలన్నదే వీరికి ప్రాధాన్యతా అంశమని, ప్రజలను పట్టించుకోవడం వదిలేశారని విమర్శించారు. ఇప్పటికీ స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు చూపించలేకపోతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో రైతాంగం కుదేలైందని, వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు రోదిస్తున్నారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జగన్ మనస్తత్వం ఎలాంటిదో తితిలీ తుపాను సమయంలో చూశామని, అటువంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బయటకు వస్తారా? అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా శ్రీకాకుళం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని, ఈ నెల 23న జిల్లాకు వస్తున్న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాకే ఇక్కడ అడుగుపెట్టాలని అల్టిమేటమ్ ఇచ్చారు. 

రైతుల గురించి మాట్లాడనప్పుడు బస్సు యాత్రలు చేపట్టి ఏం ప్రయోజనం అని మండిపడ్డారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, స్పీకర్ కూడా ఇక్కడి వారేనని, వారికి రైతుల బాధలు కనిపించడంలేదని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు కరవు తాండవిస్తోందని అన్నారు. 

శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News