Jay Shah: ‘శ్రీలంక క్రికెట్‌’‌ను బీసీసీఐ కార్యదర్శి జైషా నాశనం చేస్తున్నాడు: అర్జున రణతుంగ ఫైర్

Former captain Arjuna Ranatunga claims Jay Shah is running Sri Lanka Cricket
  • జైషా శ్రీలంక క్రికెట్‌ వ్యవహారాలను నడిపిస్తున్నాడన్న రణతుంగ 
  • శ్రీలంక బోర్డును నాశనం చేస్తున్న ఒకే ఒక్కడు జైషా అని తీవ్ర విమర్శ
  • జైషా తో శ్రీలంక క్రికెట్ బోర్డును బీసీసీఐ నియంత్రించాలని చూస్తోందని వ్యాఖ్య
శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ బీసీసీఐ కార్యదర్శి జైషాపై సంచలన విమర్శలు చేశారు. శ్రీలంక క్రికెట్‌ బోర్డును (ఎస్‌ఎల్‌సీ) నిర్వహిస్తున్నదీ, నాశనం చేస్తున్నదీ జైషాయేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జోక్యం పెరిగిపోయిందంటూ శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో రణతుంగ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, జైషాకు మధ్య సంబంధాల కారణంగా వారు(బీసీసీఐ) ఎస్ఎల్‌సీని తొక్కిపెట్టొచ్చని, నియంత్రించవచ్చని అనుకుంటున్నారు. జైషా శ్రీలంక క్రికెట్‌ వ్యవహారాలను నడిపిస్తున్నాడు. అతడి ఒత్తిడి కారణంగా బోర్డు నాశనమవుతోంది. ఒకే ఒక్కడు శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడు. జైషా తండ్రి హోం మంత్రి కాబట్టే జై ఇంత పవర్‌ఫుల్ కాగలిగాడు’’ అంటూ రణతుంగ విమర్శలు గుప్పించాడు. 

శ్రీలంక క్రికెట్ బోర్డులో జరుగుతున్న ఆధిపత్య పోరులో రణతుంగ కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంక క్రీడామంత్రి రోషన్ రణసింఘే శ్రీలంక బోర్డును రద్దు చేసి దాని స్థానంలో అర్జున రణతుంగ నేతృత్వంలో మధ్యంతర కమిటీని ఏర్పాటు చేశారు. బోర్డులో అవినీతి పెచ్చుమీరడంతోనే రద్దు చేయాల్సి వచ్చిందని క్రీడామంత్రి అప్పట్లో తెలిపారు. 

కాగా, క్రీడా మంత్రి నిర్ణయాన్ని సవాలు చేస్తున్న బోర్డు ప్రస్తుత అధ్యక్షుడు షమ్మీ సిల్వా కోర్టును ఆశ్రయించారు. దీంతో, ఈ విషయంలో దర్యాప్తు పూర్తయ్యే వరకూ బోర్డును పునరుద్ధరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే శ్రీలంక బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసింది. ఎస్‌ఎల్‌సీ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోందని వ్యాఖ్యానించింది.

కాగా, ఐసీసీ చర్యపై అర్జున రణతుంగ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘‘ఇది పద్ధతి కాదు. ఇలాంటి చర్యకు పూనుకునేముందు చాలా ప్రొసీజర్ ఉంటుంది. కానీ, ఐసీసీ అకస్మాత్తుగా ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇది అనైతికం’’ అని విమర్శించారు.
Jay Shah
Arjuna Ranatunga
Sri Lanka
India
BCCI
ICC
Cricket

More Telugu News