Cricket: నెదర్లాండ్స్‌పై తనతోపాటు కోహ్లీ, సూర్య, గిల్ బౌలింగ్ చేయడానికి కారణం చెప్పిన రోహిత్ శర్మ

Rohit Sharma gave the reason why Kohli and Surya and Gill bowled against the Netherlands
  • ఈ బౌలింగ్ ఆప్షన్లు ఎప్పుడూ తమ దృష్టిలో ఉంటాయని వెల్లడి
  • జట్టులో కొత్త బౌలింగ్ ఆప్షన్లు సృష్టించుకోవాలని భావిస్తుంటామని వివరణ
  • నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో ప్రణాళిక తప్పిందా అని ప్రశ్నించగా సమాధానమిచ్చిన హిట్‌మ్యాన్ 
బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన వరల్డ్ కప్ 2023 లీగ్ దశ చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి 160 పరుగుల తేడాతో వరుసగా 9వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీతోపాటు సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ బౌలింగ్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ కూడా తీశారు. రెగ్యులర్ బౌలర్లను పక్కనపెట్టి బ్యాట్స్‌మెన్లు బౌలింగ్ చేయడాన్ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. గ్రౌండ్‌లో కేరింతలు కొట్టారు. అయితే ఇలా బ్యాట్స్‌మెన్లతో బౌలింగ్ చేయించడానికి గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.

ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారా? ప్రణాళిక తప్పిందా? అని ప్రశ్నించగా.. ఈ బౌలింగ్ ఆప్షన్లు ఎప్పుడూ తమ దృష్టిలో ఉంటాయని రోహిత్ తెలిపాడు. జట్టులో ఈ ఆప్షన్స్ సృష్టించుకోవాలని భావిస్తుంటామని, నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో 9 మంది బౌలింగ్ ఆప్షన్‌గా ఉన్నారని రోహిత్ వివరించాడు. కొన్ని అంశాలను ప్రయోగించే మ్యాచ్ కావడంతోనే నెదర్లాండ్స్‌పై బ్యాట్స్‌మెన్లతో బౌలింగ్ చేయించామని వెల్లడించాడు. సీమర్లు అక్కర్లేని వైడ్ యార్కర్లు వేశారని ప్రస్తావించాడు. మరోవైపు.. డ్రెస్సింగ్ రూమ్‌ వాతావరణాన్ని ప్రతి ఒక్క ఆటగాడు ఆస్వాదిస్తున్నాడని, చక్కటి ఫలితాలకు ఈ వాతావరణం తోడ్పడుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. మైదానంలో బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ ఇవ్వడానికి ఇది కూడా కారణమని ప్రస్తావించాడు.

ఇదిలావుండగా వరల్డ్ కప్ 2023 లీగ్ దశలో టీమిండియా ఆడి అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మొత్తం 18 పాయింట్లతో టాప్-1 ప్లేస్‌లో నిలిచింది. ఈ బుధవారమే ముంబై వేదికగా జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది.


Cricket
Rohit Sharma
Virat Kohli
Team India

More Telugu News